ఉద్యోగాల కోత ఉండబోదని తాజాగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రకటించింది. ఇదిలావుంటే ప్రపంచ వ్యాప్తంగా టెక్ సంస్థలు ఉద్యోగులను తొలగిస్తున్న విషయం తెలిసిందే. 2023 కొత్త ఏడాదిలోనే ఏకంగా లక్ష మందికిపైగా టెక్, ఐటీ ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. పెద్ద పెద్ద కంపెనీలు వేలాది మందిని తొలగిస్తున్న ఈ తరుణంలో తమ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త అందించింది దేశీయ దిగ్గజ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. తమ కంపెనీలో మాత్రం లేఆఫ్స్ ఉండవని స్పష్ట చేసింది. ఉద్యోగులను తొలగించడం లేదని తెలిపింది. ఈ ప్రకటనతో సంస్థలోని ఉద్యోగులకు భరోసా కల్పించింది టీసీఎస్. కొత్త వారిని సైతం నియమించుకుంటామని ప్రకటించడం గమనార్హం.
ఉద్యోగాల కోతల్లో భాగంగా జాబ్ కోల్పోయిన నైపుణ్యవంతులైన స్టార్టప్ ఉద్యోగులను తమ సంస్థలో నియమించుకుంటామని తెలిపారు చీఫ్ హ్యూమన్ రీసోర్సెస్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్. చాలా సంస్థలు అవసరమైన సంఖ్య కంటే అధికంగా ఉద్యోగులను నియమించుకోవడం వల్లే లేఆఫ్‌ల పరిస్థితి వచ్చిందని చెప్పారు. కానీ, టీసీఎస్ (TCS) ఒక్కసారి తమ సంస్థలోకి ఉద్యోగులను నియమించుకుంటే వారిని తొలగించే అవకాశం ఉండదని గుర్తు చేశారు. సిబ్బంది నుంచి ఆశించిన ఫలితం రాకుంటే సరైన శిక్షణ ఇచ్చి మరీ పని చేసేలా చేస్తామని వెల్లడించారు.
టీసీఎస్‌లో ప్రస్తుతం 6 లక్షల మందికిపైగా పని చేస్తున్నారు. ఓవైపు ఉద్యోగాల తొలగింపులు జరుగుతున్నా.. గతంలో మాదిరిగానే తమ సంస్థ ఉద్యోగులకు సాలరీ ఇంక్రిమెంట్లు కల్పిస్తామని తెలిపారు మిలింద్. ప్రముఖంగా ఎడ్యూకేషన్ టెక్నాలజీ సెక్టార్‌లో ఉద్యోగాలు కోల్పోయిన వారిని నియమించుకునేందుకు చూస్తున్నట్లు చెప్పారు. యూజర్ ఎక్స్‌పీరియన్స్ డిజైన్, ఆర్టిఫిసీయల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ టెక్నాలజీ వంటి వాటిలో నైపుణ్యాలు కలిగిన వారి కోసం చూస్తున్నామన్నారు. ప్రొడక్ట్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలన్నారు. గత ఏడాది మొత్తం 2 లక్షల మందిని కొత్తగా నియమించుకోగా.. అందులో 1.19 లక్షల మంది ట్రైనీలేనని చెప్పారు. అందువల్లే కొత్త నియమామకాలు తగ్గాయని, దాంతో గత త్రైమాసికంలో సుమారు 2 వేల మంది వర్క్‌ఫోర్స్ తగ్గినట్లు చెప్పారు.
ఆర్థిక ఏడాది 2023-24లో తమ సంస్థలో 40,000 మంది ట్రైనీలను నియమించుకునే అవకాశం ఉందన్నారు మిలింద్. అలాగే.. అమెరికాలో ఉద్యోగాలు కోల్పోయిన భారతీయ వ్యక్తులను నియమించుకునేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. జాబ్ కోల్పియిన భారతీయుల వీసా గడువు ముగుస్తున్న నేపథ్యంలో వారు తిరిగి స్వదేశం వచ్చే ప్రమాదం ఏర్పడిందన్నారు. అమెరికాలో తమ సిబ్బందిలో 70 శాతం మంది అమెరికన్లేనన్నారు. దానిని 50 శాతానికి తగ్గించాలనుకుంటున్నట్లు చెప్పారు.