మెటా వెరిఫికేషన్ కోసం నెలవారీ ఛార్జీలు తప్పవని ఆ సంస్థ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ కీలక ప్రకటన చేశారు. ట్విట్టర్ బాటలో మెటా నడవనుంది. ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ల బ్లూ టిక్ వెరిఫికేషన్‌కు ఛార్జీలు వసూలు చేయనుంది. ఈ విషయాన్ని ఫేస్ బుక్ ఫౌండర్, సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ స్వయంగా ప్రకటించారు. ఈ విధానంలో ప్రభుత్వ ఐడీతో మీ ఖాతాను వెరిఫై చేస్తామని జుకర్‌బర్గ్ తెలిపారు. బ్లూ బ్యాడ్జ్ వల్ల నకిలీ అకౌంట్ల నుంచి రక్షణ లభిస్తుందన్నారు. ఈ కొత్త ఫీచర్ వల్ల విశ్వసనీయత పెరగడంతోపాటు రీచ్ పెరుగుతుందని, సెక్యూరిటీ పెరుగుతుందన్నారు. మెటా వెరిఫైడ్ సర్వీస్ కావాలనుకునే వెబ్ యూజర్లు నెలకు 11.99 డాలర్లు, ఐఓఎస్ యూజర్లు నెలకు 14.99 డాలర్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుందని జుకర్‌బర్గ్ వెల్లడించారు. ముందుగా ఈ వారంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఈ సేవలను ప్రారంభిస్తున్నామని ఆయన తెలిపారు. త్వరలోనే మిగతా దేశాలకు విస్తరిస్తామన్నారు.
బ్లూ టిక్ వల్ల నేరుగా కస్టమర్ సపోర్ట్‌ను పొందడానికి వీలవుతుంది. ప్రభుత్వ ధ్రువీకరణ పత్రంతో అకౌంట్‌ను వెరిఫై చేస్తుండటంతో.. నకిలీ అకౌంట్లను సమర్థవంతంగా గుర్తించి, తొలగించడానికి అవకాశం ఏర్పడుతుందని జుకర్‌బర్గ్ తెలిపారు. ఏది అసలైన ఖాతానో తేలిగ్గా తెలుసుకోవచ్చన్నారు. ఇప్పటికే వెరిఫైడ్ బ్యాడ్జ్ ఉన్న వారు కూడా మెటా వెరిఫైడ్ సబ్‌స్క్రిప్షన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ ప్రకటనల మీద వచ్చే ఆదాయమే ఫేస్‌బుక్‌కు ప్రధాన ఆదాయ వనరు కాగా.. బ్లూ టిక్‌లకు ఛార్జ్‌లు వసూలు చేయడం ద్వారా కూడా మెటాకు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరే అవకాశం ఉంది.
మెటా వెరిఫైడ్ అనేది ప్రొఫైల్స్‌కు మాత్రమే వర్తిస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే ఉన్న పబ్లిక్ ఫిగర్లు, సెలబ్రిటీలు, గ్లోబల్ బ్రాండ్స్ లాంటి బిజినెస్ పేజీలకు మెటా వెరిఫైడ్ బ్యాడ్జ్ ఇవ్వరని తెలుస్తోంది. ఈ ఫేస్‌బుక్ పేజీలకు వెరిఫికేషన్ ఫామ్ నింపిన తర్వాతే వెరిఫికేషన్ బ్యాడ్జ్ ఇస్తున్నారు.
మెటా వెరిఫైడ్ బ్లూ టిక్ పొందడం కోసం 18 ఏళ్లు లేదా ఆపైబడిన వయస్కులే అర్హులు. మీరు సమర్పించిన ప్రభుత్వ ధ్రువపత్రంలోని పేరు, ఫొటోతో మీ ఫేస్‌బుక్‌లోని పేరు, ఫొటోను పోల్చి చూస్తారు. ట్విట్టర్ బ్లూ కోసం నెలకు 8 డాలర్లు చెల్లించాలని ఎలాన్ మస్క్ ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. మెటా బ్లూ సర్వీస్ పొందిన యూజర్లు పోస్టు చేసిన స్టోరీలు, రీల్స్‌కు ప్రత్యేకమైన స్టిక్కర్లు వస్తాయి. నెలకు ఒక్కో యూజర్‌కు వంద స్టార్లు లేదా డిజిటల్ కరెన్సీని ఉచితంగా ఇస్తుందని సమాచారం.