తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో విద్యుత్ ద్విచక్రవాహనాలు, కార్లు, లిథియం, సెల్ గిగా ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ సీఇఓ భవీశ్ అగర్వాల్ తెలిపారు. ఇదిలావుంటే మొత్తం రూ.7,600 కోట్ల రూపాయాలతో (920 మిలియన్ డాలర్లు) ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు అవగాహన ఒప్పందంపై తమిళనాడు ప్రభుత్వం, ఓలా సంస్థ శనివారం సంతకాలు చేశాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమక్షంలో జరిగిన ఈ ఒప్పందం ద్వారా దాదాదపు 3,111 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తమిళనాడు ప్రభుత్వం తెలిపింది
ఈ సందర్భంగా భవీశ్ అగర్వాల్ మాట్లాడుతూ... ఓలా ఎలక్ట్రిక్ మొబిలిటీ తన అనుబంధ కంపెనీలైన ఓలా సెల్ టెక్నాలజీస్, ఓలా ఎలక్ట్రిక్ టెక్నాలజీస్ ద్వారా ఒక ఒప్పందంపై సంతకం చేశారని ఆయన ట్వీట్ చేశారు. కాగా, ఇటీవల తమిళనాడు ప్రభుత్వం కొత్తగా విద్యుత్ వాహన పాలసీ 2023ని ఆవిష్కరించింది. రూ.50వేల కోట్లు సమీకరణ, లక్షన్నర ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ఈ పాలసీని రూపొందించింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ఈవీ ప్లాంట్ ప్రాజెక్ట్ కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్‌లు సైతం ప్రయత్నాలు చేశాయి. కానీ, వీటన్నింటినీ కాదని తమిళనాడును ఎంపిక చేసుకుంది. దీనికి తమిళనాడు ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ వాహన పాలసీయే కారణం. తమిళనాడు పరిశ్రమల మంత్రి తంగమ్ థెన్నారుసు మాట్లాడుతూ.. ఓలా భారీ పెట్టుబడులు తమిళనాడుపై ఉన్న నమ్మకానికి నిదర్శనమని అన్నారు. భూమి సబ్సిడీ, విద్యుత్ ప్రయోజనాలతో పాటు మూలధనం లేదా టర్నోవర్ రాయితీని ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థకు రాష్ట్రం అందించిందని ఆయన వివరించారు.
పరికరాల తయారీదారులతో పాటు బ్యాటరీ తయారీదారులు, వినియోగదారులకు పర్యావరణ వ్యవస్థను రూపొందించడానికి సౌకర్యాలను కూడా రాష్ట్రం అందించింది. ఉదాహరణకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగదారులు రూ. 10 లక్షల సబ్సిడీని పొందుతారు. ‘‘తమిళనాడు ఎలక్ట్రిక్ వాహనాల విధానం తాజా అవసరాలకు అనుగుణంగా పునరుద్ధరించబడింది.. ఇది పెట్టుబడిదారులకు మరింత లాభదాయకంగా మారింది’’ అని మంత్రి తంగమ్ అన్నారు. కృష్ణగిరి జిల్లాలో ఓలా ఏర్పాటుచేసే ప్లాంట్ ద్వారా లక్షన్నర కార్లు ఉత్పత్తి చేయనున్నారు.‘‘ఈ ఏడాది చివరికి లేదా వచ్చే ఏడాది మొదట్లో ప్లాంట్ ప్రారంభమవుతుంది.. దీనిపై మేము చాలా సంతోషంగా ఉన్నాం... శామ్‌సంగ్ పలు సంస్థలు తమిళనాడును ఎంచుకున్నాయి.. ఇలాంటి మరిన్ని పెట్టుబడులు చర్చల దశలో ఉన్నాయి’’ అని ఆయన చెప్పారు.