రాబోయే 30 ఏళ్ల పాటు రైతులకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసేందుకే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) నుంచి 7 వేల మెగావాట్ల విద్యుత్ తీసుకుంటున్నట్లు ఏపీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జునరెడ్డి వెల్లడించారు. సోమవారం తిరుపతిలో ఎస్పీడీసీఎల్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. చార్జీల వసూలు కోసం వ్యవసాయ మోటార్లకు మీటర్లను ఏర్పాటు చేస్తారనడం అపోహ మాత్రమేనని, పంపిణీ వ్యవస్థలో బాధ్యతలు తీసుకొచ్చేందుకే మీటర్లు ఏర్పాటు చేస్తున్నారన్నారు. రైతుల నుంచి చార్జీలు వసూలు చేసే ప్రసక్తే లేదని చెప్పారు. 200 యూనిట్లు పైబడి విద్యుత్ వాడే వినియోగదారులకు ప్రీపెయిడ్ మీటర్లు అమర్చేలా డిస్కం నిర్ణయం తీసుకుందన్నారు. వ్యవసాయపరంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ఎలాంటి భారం లేదని, ఇప్పటి కంటే స్మార్ట్ మీటర్లతో వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలుంటాయని వివరించారు.