ఛత్తీ్‌సగఢ్‌కు గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ బదిలీ అయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతలు కొందరు సోమవారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనను కలిసినవారిలో వర్ల రామయ్య, కొనకళ్ల నారాయణరావు, గద్దె రామ్మోహనరావు, బొండా ఉమామహేశ్వరరావు, బుద్దా వెంకన్న, ‘తెలుగు యువత’ నేత ఐజాక్ తదితరులు ఉన్నారు. పార్టీలు, ప్రజాసంఘాలు అనేక అంశాలు తన దృష్టికి తెచ్చాయని, తనకు అనేక పరిమితులు ఉన్నప్పటికీ ఆయా అంశాలపై న్యాయం చేశాననే తాను అనుకొంటున్నానని గవర్నర్ పేర్కొన్నారు. ‘‘ఫలితం విషయం ఎలా ఉన్నా, మేం అడిగిన ప్రతిసారీ సమయం ఇచ్చారు. అందుకు మీకు ధన్యవాదాలు. వేరే రాష్ట్రానికి వెళ్తున్న సందర్భంగా ఒకసారి మిమ్మల్ని కలిసి వీడ్కోలు చెప్పాలని మా అధినేత మమ్మల్ని కోరారు. ఆయన తరఫున మేం వచ్చాం’’ అని ఆయనకు టీడీపీ నేతలు తెలిపారు. చంద్రబాబు సమీప బంధువు తారకరత్న చనిపోయిన విషయాన్ని ఆయనకు చెప్పారు. ఛత్తీ్‌సగఢ్ గవర్నర్‌గా వెళ్తున్న ఆయన, అక్కడ కూడా మంచి ఆరోగ్యంతో పనిచేయాలని వారు ఆకాంక్షించారు. ఆయనకు శాలువా కప్పి మెమోంటో బహూకరించారు. కాగా, ఏవైనా అంశాలపై ఫిర్యాదు చేయడానికి వచ్చినప్పుడు ముక్తసరిగా టీడీపీ నేతలతో విశ్వభూషణ్ హరిచందన్ మాట్లాడేవారు. ఈసారి మాత్రం తమతో పిచ్చాపాటీగా కొంతసేపు మాట్లాడారని టీడీపీ నేతలు తెలిపారు.