అమరరాజా బ్యాటరీస్ సంస్థకు జారీ చేసిన షోకాజ్ నోటీసుల విషయంలో తదుపరి కార్యకలాపాలను కొనసాగించవచ్చని, ఆ సంస్థ వాదనలు వినాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ)కి సుప్రీం కోర్టు ఆదేశించింది. వాదనలు విని నిర్ణయం తీసుకున్న తర్వాత అమలు చేయడాన్ని నాలుగు వారాలు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజా బ్యాటరీ్‌సకు పీసీబీ గత ఏడాది ఫిబ్రవరిలో జారీ చేసిన రెండు షోకాజ్ నోటీసులపై చట్టప్రకారం ముందుకెళ్లవచ్చని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆ కంపెనీ సుప్రీం కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసింది. సోమవారం జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా ఎం త్రివేదితో కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. అమరరాజా కంపెనీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదిస్తూ... 1985 నుంచి ఏపీలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నామని, ఇప్పటి వరకు సమస్య రాలేదని తెలిపారు. దాదాపు 15 వేల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్నామని వివరించారు. ప్రతిపక్ష ఎంపీ (టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్)కు చెందిన ఈ పరిశ్రమలో ఏడాదిన్నర కాలంలో 34 సార్లు తనిఖీలు నిర్వహించారని, పరిశ్రమలో ఎటువంటి లోపాలు లేవని ఐఐటీ మద్రాస్ కూడా నివేదిక ఇచ్చిందని వివరించారు. అయినా పరిశ్రమ మూసివేతకు షోకాజ్ నోటీసులు జారీ చేశారని పేర్కొన్నారు. పరిశ్రమ మూసివేతకు గతంలో నోటీసులు జారీ చేస్తే కోర్టు వాటిని సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు. దురుద్దేశంతో షోకాజ్ నోటీసులు జారీ చేశారని తెలిపారు. పరిశ్రమ ప్రతిపక్ష పార్టీ నేతకు చెందినంత మాత్రానా ఇలా ఎలా చేస్తారని ప్రశ్నించారు.