ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు సంక్షేమ పథకాలన్నీ రద్దు చేసి నాలుగు పదవులు ఇస్తే ఆ వర్గాలవారి కడుపు నిండుతుందా? అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది. ఆ పార్టీ మానవ వనరుల విభాగం అధ్యక్షుడు, విశ్రాంత ఐఎఎస్ అధికారి బూర్ల రామాంజనేయులు ఇక్కడ తమ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘వైసీపీ హయాంలో సరాసరి ఏడాది బడ్జెట్ రూ.2.29 లక్షల కోట్లు. టీడీపీ హయాంలో ఏడాది సరాసరి బడ్జెట్ రూ.1.40 లక్షల కోట్లు. అంత తక్కువ బడ్జెట్‌లో కూడా టీడీపీ ప్రభుత్వం మూడేళ్ళలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సంక్షేమ పథకాలకు రూ.రెండు లక్షల కోట్లు ఖర్చు చేసింది. బడ్జెట్ పెరిగినా వైసీపీ ప్రభుత్వం మూడేళ్లలో రూ.1.80 లక్షల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. వెసీపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి అతి ప్రధానమైన సబ్‌ప్లాన్ చట్టాన్ని తుంగలో తొక్కింది. పన్నులు, బాదుళ్లతో ప్రభుత్వ ఆదాయం పెరిగింది. ఆ మేరకు బడుగు వర్గాలకు నిధుల కేటాయింపు మాత్రం పెంచలేదు. నవరత్నాల పథకాలనే చూపించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికి న్యాయం చేశానని సీఎం జగన్‌రెడ్డి కబుర్లు చెబుతున్నారు’’ అని రామాంజనేయులు ఆరోపించారు.