భారతదేశంలో యూపీఏ పేమెంట్స గురించి తెలియని వారుండరన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఇదిలావుంటే దేశంలోని డిజిటల్ చెల్లింపుల ప్రక్రియలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) పేమెంట్స్ అత్యంత ప్రాధాన్యంగా మారినట్లు తెలిపారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. డిజిటల్ లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయని, భవిష్యత్తులో నగదు ట్రాన్సాక్షన్లను మించి పోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌కు చెందిన యూపీఐ, సింగపూర్‌కు చెదిన పేనౌ మధ్య డిజీటల్ ట్రాన్సాక్షన్లు లింకేజీని ప్రారంభించారు. సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్, ప్రధాని మోదీ సంయుక్తంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ క్రాస్ బార్డర్ కనెక్టివిటీని మంగళవారం ప్రారంభించారు. దీని ద్వారా ఇరు దేశాల మధ్య స్విఫ్ట్, కాస్ట్ ఎఫెక్టివ్ మార్గాల ద్వారా కేవలం ఫోన్ నంబర్ ఉపయోగించి నగదు లావాదేవీలు చేసేందుకు వీలు కలుగుతుంది.
'దేశీయంగా అభివృద్ధి చేసిన యూపీఐ విధానంలో జరుగుతోన్న డిజిటల్ లావాదేవీలు ఎంతో సురక్షితమైనవి. కేవలం గత ఏడాదిలోనే రూ.126 లక్షల కోట్లకుపైగా విలువగల 7400 కోట్ల డిజిటల్ ట్రాన్సాక్షన్లు జరిగాయి. ఇవి సింగపూర్ దేశ నగదులో సుమారు 2 లక్షల కోట్లతో సమానం. ' అని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇరు దేశాల మధ్య తొలి డిజిటల్ ట్రన్సాక్షన్‌ను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, సింగపూర్ మానిటరీ అథారిటీ ఎంటీ రవి మేనన్‌లు కలిసి చేశారు.
యూపీఐ-పేనౌలను అనుసంధానించడం ద్వారా భారత్- సింగపూర్ మధ్య యూజర్లు సులభంగా డిజిటల్ లావాదేవీలను చేసుకునే వీలుంటుంది. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు మాత్రమే ఇందుకు అనుమతిస్తున్నాయి. రానున్న రోజుల్లో మరిన్ని బ్యంకులు వీటి పరిధిలోకి వస్తాయని ఈ సందర్భంగా ఇరు దేశాలు ప్రకటించాయి. ఈ డిజిటల్ లావాదేవీల్లో రోజుకు వెయ్యి సింగపూర్ డాలర్లు అంటే రూ.60 వేల వరకు పంపించవచ్చు. యూకే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా తర్వాత భారత్‌కు అత్యధిక రెమిటెన్స్ పంపిస్తున్న జాబితాలో సింగపూర్ ఉంది. ఈ క్రమంలో డిజిటల్ లావాదేవీలు కీలకం కానున్నాయి.
భారత్- సింగపూర్‌ల మధ్య యూపీఐ మనీ ట్రాన్స్‌ఫర్ అనేది మొబైల్ యాప్ ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయొచ్చు. అయితే, అనుమతించిన బ్యాంకులు లేదా బ్యాంకింగ్‌యేతర సంస్థల ద్వారా మాత్రమే చేసేందుకు వీలుంటుంది. ప్రస్తుతం 8 ఫైనాన్షియల్ సంస్థలు ఈ లింకేజ్‌లో ఉన్నాయి. సింగపూర్‌లో డీబీఎస్ గ్రూప్ హోల్డింగ్స్, లిక్విడ్ గ్రూప్, భారత్ విషయానికి వస్తే.. యాక్సిస్ బ్యాంక్, డీబీఎస్ ఇండియా, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.