కొన్ని జీవాలు మనం ఎలా జీవించాలో స్పూర్తినిస్తాయి. అలాంటి వాటిలో గద్ద పేరు కూడా ప్రస్తావించవచ్చు. కోడిపిల్లలను ఎత్తుకుపోయే, మృతదేహాలను పీక్కు తినే పక్షిగానే గద్ద చాలా మందికి తెలుసు. చిన్నతనం నుంచి ఇలాంటి కథలు అనేకం విని గద్ద అంటే మనలో ఒక రకమైన తెలియని భయం ఉంటుంది. అయితే, గద్ద నుంచి మనం నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు అనేకం ఉన్నాయి. స్వామి వివేకానంద కూడా ఇదే విషయాన్ని చెప్పారు. వర్షం వచ్చినప్పుడు అన్ని పక్షులూ గూళ్లను వెతుక్కుంటూ ఎగురుతాయి. కానీ, గద్ద మాత్రం మేఘాలపై నుంచి ఎగరుతూ వర్షాన్ని తప్పించుకుంటుంది.
గద్దలు 70 ఏళ్ల వరకూ బతుకుతాయి. 40 ఏళ్ల వయసు వచ్చే సరికి వాటి ముక్కు బాగా పొడవుగా పెరుగుతుంది. అది ఆహారం తీసుకునేందుకు అడ్డు పడుతుంది. కాలి గోళ్లు, ఈకలు కూడా బాగా పెరిగి, చురుగ్గా ఎగరలేని పరిస్థితి ఎదురవుతుంది. ఈ పరిస్థితిని గద్ద అలాగే వదిలేస్తే.. 40 ఏళ్లతోనే దాని జీవితం అంతమవుతుంది. కానీ, ఈ దశను దాటేందుకు గద్ద మహాయజ్ఞమే చేస్తుంది. సుమారు 150 రోజులు నొప్పిని భరిస్తూ తన శరీరాన్ని ఇబ్బందులకు గురిచేసుకుంటుంది. ఎత్తైన కొండను చూసుకొని ఓ ఆవాసాన్ని ఏర్పాటు చేసుకుంటుంది గద్ద. అక్కడ కాళ్ల మధ్య తన పొడవాటి ముక్కును బండరాళ్లకు ఆన్చి వదిలించుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా నరకప్రాయమైన పని. చాలా నొప్పిని, కష్టాన్ని భరిస్తుంది. పొడవాటి ముక్కు వదిలిపోయిన తర్వాత కొత్తగా ముక్కు వచ్చేంత వరకు గద్ద ఎదురుచూస్తుంది. ఆ తర్వాత కొత్తగా వచ్చిన పదునైన ముక్కుతో అవసరానికి మించి పెరిగిన కాలి గోళ్లతో కూడా పీకేసుకుంటుంది. ఆ తర్వాత కొత్తగా వచ్చిన కాలి గోళ్లతో అవసరానికి మించి పెరిగి, తన శరీరానికి బరువుగా మారిన పాత ఈకలను కూడా పీకేస్తుంది. శరీరాన్ని తేలిగ్గా మార్చుకుంటుంది. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యేందుకు 5 నెలల సమయం పడుతుంది. 5 నెలల కష్టం తర్వాత వచ్చిన పునర్జన్మతో గద్ద మరో 30 ఏళ్లు ఏ కష్టం రాకుండా హాయిగా బతికేస్తుంది. కష్టాలు వచ్చినప్పుడు ఓర్పుతో ఎదుర్కోవాలని, ఈ సృష్టిలో బతికేందుకు మార్పు తథ్యం అనే సత్యాలను గద్ద జీవితం ద్వారా నేర్చుకోవచ్చు. కఠోర సాధన ద్వారా తమను తాము పునర్నిర్మించుకున్న వాళ్లే జీవితంలో విజయాలను సాధిస్తారని తెలుసుకోవాలి.