దొంగల చేతివాటం ఎలా ఉంటుందో కొన్ని సార్లు జరిగే విచిత్ర ఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తాయి. ప్రయాణికులు తమ తమ సామాన్లను జాగ్రత్తగా చూసుకోండి.. జేబు దొంగలు ఉంటారు జాగ్రత్త.. అంటూ బస్టాండ్లలో మైకులో ప్రకటనలు వినిపిస్తుంటాయి. గోడలపైన రాతలు, బోర్డులు కూడా కనిపిస్తుంటాయి. జేబు దొంగల మాటెలా ఉన్నా కర్ణాటకలో ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు. రాత్రిపూట బస్టాండ్ ఆవరణలో పార్క్ చేసిన బస్సు తెల్లారేసరికి మాయమైంది. దీంతో ఆర్టీసీ అధికారులు పోలీసులను ఆశ్రయించారు.
కలబురిగి జిల్లా చించోలి బస్టాండ్ లో ఈ దొంగతనం జరిగింది. బీదర్-2 డిపోకు చెందిన KA-38 F-971 బస్సు చించోలి-బీదర్ మధ్య రాకపోకలు సాగిస్తుంది. సోమవారం రాత్రి బీదర్ నుంచి ప్రయాణికులతో చించోలికి వచ్చింది. అదే లాస్ట్ ట్రిప్ కావడంతో డ్రైవర్ ఆ బస్సును బస్టాండ్లో పార్క్ చేశారు. ఉదయం బీదర్ తీసుకెళ్లేందుకు వచ్చిన డ్రైవర్ కు బస్సు కనిపించలేదు.
దీంతో ఆర్టీసీ అధికారులకు సమాచారం అందించగా.. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలించగా తెలంగాణలో బస్సు దొరికింది. అయితే, బస్సును ఎవరు దొంగిలించారు, తెలంగాణ దాకా ఎలా తీసుకొచ్చారనే విషయం ఇంకా తెలియరాలేదు.