ఒక్క ఫోన్ ఆ ప్రయాణికురాలిని ఆర్థికంగా నష్టపోకుండా ఆదుకొంది. దీంతో అదృష్టం అంటే వీళ్లదే అని చెబుతున్నారు అందరూ...ఓ మహిళకు పోగొట్టుకున్న బంగారం మళ్లీ దొరికింది.. వాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. కాచిగూడ నుంచి బెంగళూరు వెళుతున్న 17603 ఎక్స్‌ప్రెస్ రైలులో.. అఖిల అనే ప్రయాణికురాలు కుటుంబసభ్యులతో కలిసి అనంతపురం వెళ్లారు. స్టేషన్‌లో రైలు దిగే సమయంలో.. పొరపాటున సంచి మరచిపోయారు. స్టేషన్ నుంచి ఇంటికి వెళ్లిన తర్వాత సంచి గురించి గుర్తొచ్చింది.
వెంటనే అఖిల అప్రమత్తం అయ్యారు.. 139కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఆ వెంటనే స్పందించిన ఆర్పీఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది.. ధర్మవరం ఆర్పీఎఫ్ పోలీసులను అలర్ట్ చేశారు. అక్కడ సెక్యూరిటీ విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది రైలులోని ఎస్-6 కోచ్‌కు వెళ్లారు. లోపల ఉన్న సంచిని తీసుకొని ధర్మవరం ఆర్పీఎఫ్ సీఐకు అందజేశారు.
ఆ సంచిలో ఉన్న 12 తులాల బంగారు, 10 తులాల వెండి, ల్యాప్‌టాప్‌లను అఖిలకు సీఐ అప్పగించారు. వాటి విలువ రూ.7.50 లక్షలు ఉంటుందని.. సంచి రైలులో పొరపాటున మర్చిపోయానన్నారు. తాను సమాచారం అందించిన వెంటనే స్పందించిన ఆర్పీఎఫ్ పోలీసులకు అఖిల, కుటుంబసభ్యులు ధన్యవాదాలు తెలిపారు. పోయిందనుకున్న బంగారం దొరకడంతో సంతోషించారు.