కర్నూలు నగర వాసులకు కుక్కల భయం వెంటాడుతోంది. దీంతో బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. ఇక రాత్రిపూట ఇంటి నుంచి బయటకు రావాలన్నా.. బయట నుంచి ఇంటికి వెళ్లాలన్నా జంకుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలను కుక్కలు భయపెడుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో తొమ్మిది పురపాలక సంఘాలు, 55 మండలాల్లో కుక్కల (Dogs) సంఖ్య 50 వేలకుపైగా ఉండటమే అందుకు కారణంగా చెబుతున్నారు.
ముఖ్యంగా పురపాలక సంఘాల్లోనే కుక్కల సంఖ్య 30 వేలకు వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కర్నూలులో 10 వేలు, నంద్యాల 4-5 వేలు, ఆదోని 3-4 వేలు, ఎమ్మిగనూరు 2 వేలు, మిగిలిన పురపాలక సంఘాల్లో సరాసరి వెయ్యి-2 వేల వరకు ఉంటుందని అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో కుక్క కాటు బాధితుల సంఖ్య రోజుకు 10-15 వరకు ఉంటోందని చెబుతున్నారు. చికిత్స పొందినవారి సంఖ్య... నాటు వైద్యం, ఇంటి వైద్యం తీసుకున్న వారితో కలిపి లెక్కిస్తే నెలకు 50కిపైగా ఉంటోందని అధికారులు చెప్పడం.. సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.
కర్నూలు నగర పాలక సంస్థ, పురపాలకల్లోనే కుక్కల నియంత్రణ చర్యలు కనిపించడం లేదు. ఇక గ్రామీణ ప్రాంతాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కుక్కలకు విషం పెట్టి చంపాలనుకున్న ప్రక్రియను జంతు ప్రేమికులు వ్యతిరేకించడంతో.. అది కార్యాచరణకు నోచుకోలేదు. ఆ తర్వాత అడవుల్లో వదలాలని భావించారు. కానీ.. అలా చేస్తే కేసులు పెడతామని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో ఆ విషయంలోనూ వెనుకడుగు వేశారు. చిట్ట చివరికి కుక్కల సంతతి నియంత్రించాలని నిర్ణయించారు. ఆ చర్యలు కూడా మొక్కుబడిగా మారాయి. దీంతో కుక్కల సమస్య పెరుగుతోంది. ఫలితంగా చిన్నారులు బలవుతున్నారు.