అక్రమ సంబంధం అనుమానంతో నెల్లూరు శివారు తల్పగిరి కాలనీలో దారుణం జరిగింది. ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. పొదలకూరులోని రామమందిరం ప్రాంతానికి చెందిన రావుల శ్రీనివాసులు, విజయలక్ష్మి దంపతుల కుమారుడు అనుదీప్. శ్రీనివాసులు అనారోగ్యంతో మృతి చెందారు. తల్లి విజయలక్ష్మి ఉపాధ్యాయురాలు. అనుదీప్‌కు మూడేళ్ల కిందట పావని అనే మహిళతో పెళ్లైంది. వీరికి చిన్నపాప కూడా ఉంది. అనుదీప్ డిప్లొమా వరకు చదివి.. స్పీచ్ థెరపిస్ట్‌గా జాబ్ చేస్తున్నారు.
పొదలకూరులో అనుదీప్ కుటుంబం నివాసం ఉంటున్న భవనంలోనే సురేష్ కుటుంబం కూడా ఉంటోంది. దీంతో అనుదీప్, సురేష్ ఫ్రెండ్స్ అయ్యారు. ఈ నేపథ్యంలో.. 7 నెలల కిందట అనుదీప్ కుటుంబం బుజబుజ నెల్లూరుకు వచ్చి ఓ అద్దె ఇంట్లో ఉంటోంది. మంగళవారం రాత్రి అందరూ భోజనం చేసి నిద్రపోయారు. తెల్లవారుజామున 2.45 గంటలకు అనుదీప్ భార్య పావని సెల్‌ఫోన్‌కు సురేష్ ఫోన్ చేశాడు. నిద్రలో ఉండి ఆమె తీయకపోవడంతో.. తిరిగి అనుదీప్ సెల్‌ఫోన్‌కు కాల్ చేశాడు. ఆయన తీసి మాట్లాడారు.
సురేష్ నెల్లూరుకు వస్తున్నాడని.. రైల్వేస్టేషన్‌లో వదిలి వస్తానని భార్యకు చెప్పి అనుదీప్ బైక్‌పై వెళ్లాడు. కానీ.. తిరిగి రాలేదు. తన భర్త తిరిగి రాకపోవడంతో.. భార్య ఆయన సెల్‌కు ఫోన్ చేశారు. ఎవరూ తీయలేదు. అనుదీప్ తల్లి విజయలక్ష్మి కూడా డ్యూటీకి వెళుతూ కాల్ చేశారు. కానీ.. ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. ఇదే సమయంలో.. తల్పగిరి కాలనీలో గుర్తుతెలియని వ్యక్తి గాయాలతో కాలువలో పడి ఉన్నాడని పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పక్కనే సెల్‌ఫోన్‌ను గుర్తించి స్విచ్ఛాన్ చేశారు.
అప్పుడే.. పావని ఫోన్ చేయడంతో అనుదీప్ హత్యకు గురైనట్లు గుర్తించారు. తెల్లవారుజామున తన భర్తకు సురేష్ నుంచి ఫోను వచ్చిందని.. ఆయన పిలవడంతోనే వెళ్లాడని పావని పోలీసులకు చెప్పారు. సురేష్‌కు ఫోను చేయగా.. స్విచ్ఛాఫ్ వచ్చింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు పలు కోణాల్లో విచారణ చేపట్టారు. వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న సురేష్ కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
ఇక్కడే మరో విషయం వెలుగులోకి వచ్చింది. అనుదీప్‌ను హత్య చేశాడని అనుమానిస్తున్న సురేష్‌కు ఒక చేయి లేదు. ఒక చేయి మోచేతి వరకు తొలగించారు. దీంతో ఆయనొక్కరే హత్య చేశాడా? ఇంకెవరైనా సాయం చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్య జరిగిన ప్రాంతంలోని ఓ ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలో కీలక దృశ్యాలు కనిపించాయి. తీవ్ర గాయాలతో ఉన్న అనుదీప్ అతి కష్టంపై నడుస్తూ రోడ్డుపైకి వచ్చాడు. ఆ తర్వాత కాలువలో పడిపోయినట్లు సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. దీంతో ఇది కచ్చితంగా హత్యే అని పోలీసులు భావిస్తున్నారు.