పేదవాడు తన సొంత ఇంటి అవసరాల కోసం పిడికెడు మట్టి. గుప్పెడు ఇసుక ముట్టుకుంటే కేసులు బనాయించే పాలకవర్గాలు సత్యసాయి జిల్లాలో ఇష్టానుసారంగా కొండలు గుట్టలు వాగులు వంకలు టన్నులకొద్దీ టిప్పర్లతో అక్రమంగా తరలిస్తున్న అధికార యంత్రాంగం మొద్దు నిద్ర నటిస్తోందని, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సత్యసాయి జిల్లా అధ్యక్షులు అడపాల వేమనారాయణ శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టపర్తికి కూతవేటు దూరంలో సర్వే నెంబర్ 1747లో నల్లమ్మగుట్టను జెసిబిలతో తవ్వేస్తూ టన్నుల కొద్ది తరలిస్తున్నారని రెవెన్యూ అధికారులు కానీ మైనింగ్ శాఖ గాని అటువైపు కన్నెత్తి చూడలేదని అదేవిధంగా కదిరి, హిందూపురం, ధర్మవరం ప్రాంతాల్లో యదేచ్చగా పాలకవర్గాల కనుసన్నల్లో రాజకీయ దళారులు కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార యంత్రాంగం మొద్దు నిద్ర వీడి వీటికి అడ్డుకట్ట వేయకపోతే సహజ వనరులు కనుమరుగయ్యి ప్రకృతి విపత్తుల ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.