వివేకానంద రెడ్డి హత్య కేసులో.. అవినాష్‌రెడ్డికి సంబంధం లేదని.. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అవినాష్‌రెడ్డికి సంబంధం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఎన్నికల ముందు వివేకా హత్య కేసు ద్వారా జగన్‌ను నైతికంగా దెబ్బతీసేందుకు ప్రయత్నించారని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలు బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డికి సంబంధాలు ఉన్నట్లు ఆధారాలున్నాయని సజ్జల స్పష్టం చేశారు.
'వైఎస్ వివేకానందరెడ్డిని కోల్పోవడం పార్టీకి, జగన్‌కు నష్టమే. వివేకా తిరిగి పార్టీలోకి వస్తానంటే ఆహ్వానించింది వైఎస్ జగనే. వివేకా హత్య కేసులో విచారణ నిష్పక్షపాతంగా జరగడం లేదని అనుమానం కలుగుతోంది. కొందరిని టార్గెట్ చేస్తూ విచారణ చేస్తున్నారు. వివేకా బావమరిది శివప్రకాష్‌రెడ్డి ఫోన్ చేస్తేనే.. అవినాష్‌రెడ్డి వెళ్లారు. శివప్రకాష్‌రెడ్డి ఫోన్ చేసి వివేకా గుండెపోటుతో చనిపోయారని తనకు చెప్పినట్లు ఆదినారాయణరెడ్డే చెప్పాడు. వివేకా ఫోన్‌లోని రికార్డులను ఎందుకు డిలీట్ చేశారు' అని సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రశ్నించారు.
'వివేకా హత్యకు, రెండో పెళ్లికి సంబంధం ఉందని ఓ పేపర్‌లో వార్త రాశారు. కుటుంబ సభ్యులంతా కలిసి వివేకా చెక్ పవర్ తీసేశారని న్యూస్ వచ్చింది. చంద్రబాబు హయాంలోనే వివేకా హత్య జరిగింది. బీటెక్ రవి, ఆదినారాయణరెడ్డి, వివేకా అల్లుడు రాజశేఖర్‌రెడ్డి ఫోన్ రికార్డులు ఎందుకు చూడలేదు? శివశంకర్‌రెడ్డి మా పార్టీ నాయకుడు.. వైయఎస్, వివేకాతో కలిసి పనిచేశారు. శివశంకర్‌రెడ్డి తప్పు చేయలేదని మేం భావిస్తున్నాం. వివేకా హత్య కేసులో స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ మొత్తం చంద్రబాబుదే. సీబీఐ వెనుక రాజకీయ ప్రమేయం కచ్చితంగా ఉంది' అని సజ్జల అనుమానం వ్యక్తం చేశారు.
'బీజేపీలోని తన కోవర్టుల ద్వారా చంద్రబాబు సీబీఐ విచారణను ప్రభావితం చేస్తున్నారు. చంద్రబాబు గతంలో వైఎస్‌పై ఫ్యాక్షనిస్ట్ ముద్ర వేసి కుట్రలు చేశారు. ఇప్పుడు జగన్‌పై కూడా కుట్రలు చేస్తున్నారు. చంద్రబాబు పకడ్బందీగా కథనం తయారు చేస్తారు. ఆ కథనాన్ని అనుకూల మీడియాలో ప్రచారం చేయిస్తారు. ఇదే అంశాన్ని టీడీపీ నాయకులు పదేపదే ప్రస్తావిస్తారు' అని సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు.