ఏ బ్యాంకులో ఫిక్స్ డిపాజిట్ చేస్తే ఎక్కువ వడ్డీ వస్తుంది అన్న ఆలోచన ప్రతి ఒక్కరూ చేస్తారు. అలాంటి వారికి ఇదో శుభవార్త. ఇదిలావుంటే భవిష్యత్తులో ఆర్థిక భద్రత కోసం చేసే పెట్టుబడుల్లో భారతీయులు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే వాటిల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఒకటి. తక్కువ రిస్క్‌తో గ్యారెంటీ రిటర్న్స్ ఉండడమే అందుకు ప్రధాన కారణం. దాంతో పాటు అనువైన కాల పరిమితి, పన్ను ప్రయోజనాలు వంటివి సైతం ఉంటాయి. వీటిల్లో సీనియర్ సిటిజన్లకు సాధారణ ప్రజలతో పోలిస్తే బ్యాంకులు ఎఫ్‌డీలపై కాస్త ఎక్కువ వడ్డీ ఇస్తుంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవలే రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బ్యాంకులు రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతున్నాయి. మరోవైపు.. డిపాజిట్లను ఆకర్షించేందుకు అధిక వడ్డీలను ఆఫర్ చేస్తున్నాయి. ఎఫ్‌డీలపై అధిక వడ్డీ ఇస్తోన్న టాప్-5 బ్యాంకుల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..
దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్‌బీఐలో ఐదేళ్ల నుంచి 10 ఏళ్ల కాల పరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7.5 శాతం వార్షిక వడ్డీని ఇస్తోంది. ఇదే టెన్యూర్లపై సాధారణ ప్రజలకు 6.50 శాతం వడ్డీ వర్తిస్తుంది. సాధారణ ప్రజలతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు ఒక శాతం మేర వడ్డీ అధికంగా అందిస్తోంది ఎస్‌బీఐ. పెంచిన వడ్డీ రేట్లు ఫిబ్రవరి 15 నుంచే అమల్లోకి తీసుకొచ్చింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మరోవైపు.. సీనియర్ సిటిజన్ల కోసం కొత్త ఎఫ్‌డీ పథకాన్ని కూడా ప్రకటించింది. అమృత కాల్ పేరుతో కొత్త టెన్యూర్ డిపాజిట్ స్కీమ్ తీసుకొచ్చింది. 400 రోజుల కాల పరిమితితో కూడిన ఈ ఎఫ్‌డీలపై సీనియర్ సిజిటన్లకు 7.6 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఈ స్కీమ్‌లో చేరడానికి ఫిబ్రవరి 15 నుంచి మార్చి 31 వరకు మాత్రమే గడువు ఇచ్చింది ఎస్‌బీఐ.
పంజాబ్ నేషనల్ బ్యాంక్..
ఎంపిక చేసిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 30 బేసిస్ పాయింట్లు మేర పెంచుతున్నట్లు ఇటీవలే ప్రకటించింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ . ఐదేళ్ల కాల పరిమితి కలిగిని ఎఫ్‌డీలపై సీనియర్ సిటిజన్లకు 7 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. ఐదు నుంచి 10 ఏళ్లలోపు ఎఫ్‌డీలకు 7.30 శాతం వడ్డీ ఇస్తోంది. సాధారణ ప్రజలకు 3 నుంచి 5 ఏళ్ల టెన్యూర్ డిపాజిట్లకు 6.50 శాతం వడ్డీ అందిస్తోంది. కొత్త వడ్డీ రేట్లు ఫిబ్రవరి 20 నుంచి అమలులోకి వచ్చినట్లు పీఎన్‌బీ తెలిపింది.
బ్యాంక్ ఆఫ్ ఇండియా..
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఐదు నుంచి ఎనిమిదేళ్ల లోపు ఎఫ్‌డీ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు గరిష్ఠంగా 6.75 శాతం వడ్డీని ఇస్తోంది బీఓఐ. అలాగే.. 8 నుంచి 10 ఏళ్లలోపు డిపాజిట్లకు సైతం అదే వడ్డీ ఇస్తోంది. మరోవైపు.. రెండేళ్ల నుంచి ఐదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లకు 7.25 శాతం మేర వడ్డీ అందిస్తోంది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..
ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐదేళ్ల నుంచి పదేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై సీనియర్ సిజిటన్లకు గరిష్ఠంగా 6.92 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఇక మూడు నుంచి ఐదేళ్ల ఎఫ్‌డీలపై కూడా అదే వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది.
కెనరా బ్యాంక్..
మరో ప్రభుత్వ బ్యాంక్ కెనరా బ్యాంక్ ఐదేళ్ల టెన్యూర్ కలిగిన డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు 7 శాతం వడ్డీని అందిస్తోంది. మూడు నుంచి ఐదేళ్ల కాల పరిమితి కలిగిన డిపాజిట్లపై 7 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. రూ.15 లక్షల నుంచి రూ.2 కోట్ల లోపు నాన్ కాలబుల్ ఎఫ్‌డీ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు గరిష్ఠంగా 7.45 శాతం వడ్డీ ఇస్తోంది కెనరా బ్యాంక్..