శ్రీకాకుళం జిల్లాలో దారుణం జరిగింది. రూ.350 బాకీ వ్యవహారం కొట్లాటకు దారి తీసింది. ముగ్గురు కత్తిపోట్లకు గురికావాల్సి వచ్చింది. పొందూరులో శుక్రవారం రాత్రి 10గంటల తరువాత ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. స్థానిక పాత ఎస్‌బీఐ ఎదురుగా చౌదరి అమ్మన్నాయుడు పాన్ షాపు నిర్వహిస్తున్నాడు. దవళపేటకు చెందిన నూక శ్యామ్‌సుందర్ అమ్మన్నాయుడు వద్ద సిగరెట్ల కోసం చేసిన అప్పు రూ.350 ఉంది. అమ్మన్నాయుడు రెండు రోజుల క్రితం బాకీ కట్టాలని అడిగాడు. అంతేకాకుండా దవళపేటకు చెందిన వారితో ఈ బాకీ వ్యవహారం చెప్పాడు. దీంతో ఆగ్రహోదగ్రులైన నూక శ్యామ్‌సుందర్, పి.రాము, పి.స్వాతికుమార్, పవన్ శుక్రవారం రాత్రి పాన్‌షాపు వద్దకు వచ్చారు. అప్పుడు షాపులో అమ్మన్నాయుడు కుమారుడు మహేష్ ఉన్నాడు. ఇరువురి మధ్య గొడవ జరిగింది. అమ్మన్నాయుడు కూడా రావడంతో ఇది మరింత పెద్దదైంది. తర్వాత అమ్మన్నాయుడు కత్తితో వారిపై దాడి చేశాడు. శ్యామ్‌సుందర్, పవన్‌కు గాయాలయ్యాయి. అక్కడే ఉన్న పేడాడ శ్యామలరావు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. అతనికి కూడా కత్తి తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన వారిని పొందూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తీసుకెళ్లారు. శ్యామ్‌సుందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ లక్ష్మణరావు తెలిపారు.