కరెంటు బిల్లుల్లో ఇప్పటికి వడ్డించింది చాలలేదని మళ్లీ ప్రతి నెలా బాదుకుంటూ పోతారా అని శాసనసభ పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ నాలుగేళ్లలో రూ.50వేల కోట్ల మేర విద్యుత్ వినియోగదారులపై భారం మోపారు. ఏడుసార్లు విద్యుత్ చార్జీలు పెంచి రూ.16వేల కోట్లు నేరుగా బాదారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రూ.31 వేల కోట్లు అప్పులు తెచ్చారు. హిందూజా కంపెనీకి అప్పనంగా రూ.1,200 కోట్లు చెల్లించడానికి సిద్ధపడ్డారు. అప్పులు, హిందూజా చెల్లింపులు కూడా జనం నెత్తిన పడేవే. ఇవన్నీ కూడా విద్యుత్ వినియోగదారులే చెల్లించాలి. మళ్లీ ప్రతినెలా ఒకో యూనిట్‌పై అర్ధ రూపాయి కొత్తగా వేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ అసమర్థతకు, అవినీతికి ప్రజలు ఎందుకు తమ జేబుల్లో నుంచి మూల్యం చెల్లించాలి?’’ అని ప్రశ్నించారు.