లా పూర్తి చేయాలన్న మక్కువతో ఓ మాజీ ఎమ్మెల్యే 51 ఏళ్ల వయసులో ఇంటర్ పరీక్షలకు హాజరయ్యారు. చేతిలో ఎగ్జామ్ ప్యాడ్, హాల్ టికెట్‌తో పరీక్ష కేంద్రానికి వచ్చిన ఆయన్ను చూసిన అక్కడున్న విద్యార్థులు షాకయ్యారు. పరీక్షలు రాయడానికి మాజీ ఎమ్మెల్యే మాత్రం ఆసక్తికర కారణం వివరించారు. ఉత్తర్ ప్రదేశ్‌లోని బరెలీ జిల్లాకు చెందిన రాజేష్ కుమార్ మిశ్రా (51) అలియాస్ పప్పు భర్తౌల్ 2017 ఎన్నికల్లో బైథ్రి చైన్‌పుర్ నియోజకవర్గం నుంచి బీజేపీ (BJP) తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వడానికి ఆ పార్టీ నిరాకరించింది. దాంతో ఆయన ఒకవైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే ఇంకో పక్క చదువునూ కొనసాగించాలనుకున్నారు.
ఈ క్రమంలోనే ఇంటర్‌లో చేరి పరీక్షలకు హాజరవ్వాలని నిర్ణయించుకున్నారు. రాష్ట్రంలో ఫిబ్రవరి 16 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో మాజీ ఎమ్మెల్యే తనకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి వచ్చారు. ఒక చేతిలో ఎగ్జామ్ ప్యాడ్, హాల్ టికెట్, మరో చేతిలో వాటర్ బాటిల్‌తో ఉన్న రాజేశ్ మిశ్రాను చూసిన విద్యార్థులు ఆశ్చర్యపోయారు. అయితే, తాను పరీక్షలు రాయడానికి గల కారణాన్ని అక్కడున్న వారికి ఆయన తెలియజేశారు. లా డిగ్రీ చేసి సామాన్యులకు సరైన న్యాయం అందేలా చూడటమే తన సంకల్పమని తెలిపారు.
‘‘ఈ పరీక్షలు యువతతో మమేకం కావడానికి దోహదపడుతాయి.. అలాగే చాలా మంది ఆర్థికంగా వెనుకబడి ఉండటం వల్ల మంచి న్యాయవాదిని ఎంచుకోలేక సరైన న్యాయాన్ని పొందలేక పోతున్నారు.. ఈ విషయాన్ని నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గ్రహించాను.. అలాంటి వారికి న్యాయ సహాయం అందించడానికి లా చదవాలనేది నా కోరిక.. దీనికోసం 12వ తరగతి బోర్డు పరీక్షలు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది... నాకు సైన్సు అంటే ఇష్టమైనప్పటికీ లాయర్ కావాలనే ఉద్దేశంతో ఆర్ట్స్‌ను ఎంచుకున్నాను’’ అని రాజేష్ కుమార్ మిశ్రా పేర్కొన్నారు.
నన్ను చూసి తొలుత ఆశ్చర్యానికి గురైన విద్యార్థులు.. కానీ, ఓ రాజకీయ నేత మాతో కలిసి పరీక్షలు రాస్తున్నారని సంతోషించారని చెప్పారు. హిందీ, ఫైన్ ఆర్ట్స్, సోషల్ స్టడీస్, సివిక్స్, సోషియాలజీల సబ్జెక్టులను ఎంపిక చేసుకున్నానని చెప్పారు. ఇవి న్యాయశాస్త్రం అభ్యసించడానికి సహకరిస్తాయని అన్నారు. రోజూ రాత్రి 11 నుంచి ఒంటి గంట వరకు చదువుతానని, ఈ విషయంలో తన కుటుంబసభ్యులు కూడా సహకరిస్తున్నారని ఆయన తెలిపారు. పరీక్షల ఒత్తిడి నుంచి బయటపడటానికి తన పిల్లలు కూడా టిప్స్ చెబుతున్నారని రాజేశ్ మిశ్రా వివరించారు.
‘ఎటువంటి ఆందోళన చెందకుండా చదువుపైనే దృష్టిపెట్టాను.. యువ విద్యార్థులకు ఇదే చెబుతున్నాను.. జీవితంలో విజయానికి పనిపై దృష్టి సారించడమే మూల మంత్రం’ అని అన్నారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తాననే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. కాగా రాజేష్ మిశ్రాకు డ్రిగ్రీ పూర్తి చేసిన ముగ్గురు పిల్లలు ఉన్నారు.