విద్యార్థులు మత్తు పదార్థాలు, సైబర్ నేరాలపై అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని సెట్విన్ సీఈవో మురళీకృష్ణ అన్నారు. స్థానిక ఎస్వీ ఆయుర్వేద కళాశాలలో సోమవారం విద్యార్థుల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ...... స్నేహితుల ప్రోద్భలంతో లేదా సరదా కోసమో మత్తు పదార్థాలను వినియోగించరాదన్నారు. అవి వ్యసనంగా మారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తాయన్నారు. సైబర్ మోసాల బారిన పడకుండా ఎలా ఉండాలనే విషయాలను ఆయన ఉదాహరణలతో వివరించారు. అలాగే సైబర్ నేరాలకు గురికాకుండా ఉండేందుకు పాటించాల్సిన జాగ్రత్తలు, ఈవ్ టీజింగ్‌కు పాల్పడితే దాని పరిణామాలు, దిశా యాప్ ఉపయోగాలపై దిశా మహిళా పోలీసులు ప్రత్యేకంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్వీ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మురళీకృష్ణ, అధ్యాపకులు సుందరం, వెంకట శివుడు, రాజ్ కుమార్, గోపాలకృష్ణయ్య, దిశా పోలీసులు స్వాతి, ఆశ, రేవతి, స్వప్న పాల్గొన్నారు.