తీవ్ర అనారోగ్యంతో ఉన్న 13 నెలల పాపకు.. బ్రెయిన్ డెడ్ అయిన రెండేళ్ల బాలుడి గుండెను అమర్చి వైద్యులు ప్రాణం కాపాడారు. చెన్నై నుంచి అంబులెన్స్‌లో గుండెను తిరుపతికి తరలించి గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి సోమవారం మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. తిరుపతిలోని పద్మావతి చిన్న పిల్లల హృదయాలయ (చిన్నపిల్లల గుండె ఆస్పత్రి)లో నెల రోజుల వ్యవధిలో రెండో గుండె మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించడం గర్వకారణమన్నారు. గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన 13 నెలల చిన్నారికి గుండె దెబ్బతినడంతో మూడు నెలల క్రితం ఆస్పత్రికి తీసుకువచ్చారు. వైద్యులు పరీక్షించి గుండె మార్పిడి చికిత్స చేయాలని జీవన్ దాన్‌లో పాప వివరాలను నమోదు చేశారు. చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్‌కు గురైన రెండేళ్ల బాలుడి గుండె దానం చేస్తారనే విషయం ఆదివారం పద్మావతి ఆస్పత్రి డైరెక్టర్ శ్రీనాథరెడ్డి దృష్టికి వచ్చింది. ఆయన గుండె చికిత్సల నిపుణుడు డాక్టర్ గణపతి బృందంతో చర్చించి ఆ బాలుడి గుండెను 13 నెలల పాపకు అమర్చాలని నిర్ణయించారు. ఆ విషయాన్ని చిన్నారి తల్లిదండ్రులకు వివరించడంతో ఆదివారం రాత్రికి చిన్నారిని ఆస్పత్రికి తీసుకువచ్చారు. అదేరోజు పద్మావతి హృదయాలయ వైద్య బృందం ప్రత్యేక అంబులెన్సులో చెన్నై ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుని బాలుడి గుండెను గ్రీన్ చానల్ అవసరం లేకుండా 2.15 గంటల వ్యవధిలో తిరుపతికి తీసుకువచ్చారు. సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు బాలుడి గుండెను తీసుకురాగా.. అప్పటికే సిద్ధంగా ఉన్న వైద్య బృందం ఉదయం 4.30 గంటలకు గుండె మార్పిడి శస్త్ర చికిత్స ప్రారంభించి 9.40 గంటలకు పూర్తి చేసింది. రూ.30 లక్షల వరకు ఖర్చయ్యే ఆపరేషన్‌ను ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా నిర్వహించారని ధర్మారెడ్డి తెలిపారు. ఆస్పత్రి డైరెక్టర్ శ్రీనాథరెడ్డి మాట్లాడుతూ.. ఆస్పత్రి ప్రారంభించిన 15 నెలల్లోనే 1150 మందికి పైగా చిన్నారులకు గుండె శస్త్ర చికిత్సలు నిర్వహించామన్నారు. సమావేశంలో టీటీడీ జేఈవో సదా భార్గవి, బర్డ్ ఆస్పత్రి ప్రత్యేకాధికారి డాక్టర్ రెడ్డెప్ప రెడ్డి, డాక్టర్ సౌమ్య పాల్గొన్నారు.