ఉమ్మడి చిత్తూరు జిల్లా నియోజకవర్గ శాసనమండలి సభ్యుడిగా సిపాయి సుబ్రహ్మణ్యం స్థానిక సంస్థల కోటాద్వారా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ స్థానానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా చుక్కా ధనుంజయ యాదవ్ దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. నామినేషన్ల ఉపసంహరణ పర్వం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగియడంతో సిపాయి సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జేసీ ఎస్.వెంకటేశ్వర్ ప్రకటించారు. అనంతరం కలెక్టర్ ఎం.హరినారాయణన్‌ను సిపాయి సుబ్రహ్మణ్యం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ పదవిలో బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి ఆయన ఆరేళ్లపాటు ఎమ్మెల్సీగా కొనసాగుతారు. ప్రస్తుతం ఈ స్థానంలో ఎమ్మెల్సీగా ఉన్న దొరబాబు పదవీకాలం ఈ ఏడాది మే ఒకటో తేదీతో ముగియనుంది. ఇప్పటివరకు వైసీపీకి చెందిన భరత్ జిల్లానుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతుండగా, సిపాయి సుబ్రహ్మణ్యం ఎన్నికతో ఈ సంఖ్య రెండుకు చేరింది. ఇక పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై జిల్లా ఎన్నికల విభాగం దృష్టి సారించింది.