‘వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పులివర్తి నానీని భారీ మెజారిటీతో గెలిపించి శాసనసభకు పంపించండి’ అని సోమవారం చంద్రగిరి మండలం తొండవాడ బహిరంగ సభలో నారా లోకేశ్ పిలుపునిచ్చారు. దీంతో రానున్న ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పులివర్తి నానీయే ఉంటారన్న దానిపై స్పష్టత ఇచ్చేశారు. నానీని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత తాను తీసుకుంటానని ప్రకటించడంతో అటు నానీ సన్నిహితులకు, అనుచరవర్గానికి కొండంత బలం వచ్చినట్టయింది. కొంతకాలంగా చంద్రగిరి టీడీపీ అభ్యర్థిత్వం విషయమై పలు రకాల ప్రచారాలు సాగుతున్నాయి. చంద్రగిరిలో పోటీ చేయడానికి నానీ ఆసక్తి చూపడం లేదని, చిత్తూరులో పోటీ చేయాలని భావిస్తున్నారనే ప్రచారం జరిగింది. ప్రస్తుతానికి చంద్రగిరికి ఇన్‌చార్జిగానే కొనసాగుతారని, చివర్లో టికెట్ ఆయనకు కాకుండా ఇతరులకు ఇస్తారన్న ప్రచారమూ నడిచింది. ఆర్థికంగా శక్తిమంతులైన మరికొందరి పేర్లూ అధిష్ఠానం పరిశీలనలో ఉన్నట్టు ప్రచారమైంది. దీంతో నియోజకవర్గ పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. ఈ ప్రచారాలను తిప్పికొట్టడానికి నానీ ఎంతగా ప్రయత్నించినా సఫలం కాలేకపోయారు. ఎట్టకేలకు సోమవారం నాటి తొండవాడ సభలో లోకేశ్ విస్పష్ట పిలుపుతో వీటన్నింటికీ తెర పడినట్టయింది. పార్టీ శ్రేణులు కూడా గందరగోళానికి స్వస్తి పలికి వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం పనిచేసేందుకు సమాయత్తం కావడానికి ఈ పరిణామం దారి తీసిందని చెప్పాలి.