నూతన పెన్షన్ విధానం(ఎన్‌పీఎస్) రద్దుకు దేశవ్యాప్త ఉద్యమం చేపట్టనున్నట్లు రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ జనరల్ సెక్రటరీ శంకరరావు అన్నారు. తెలంగాణలోని డోర్నకల్‌లో ఆధునికీకరించిన యూనియన్ కార్యాలయాన్ని ఆయన సోమవారం ప్రారంభించారు. అనంతరం అక్కడే జరిగిన సింహగర్జన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నూతన పెన్షన్ విధానం రద్దుకు దేశవ్యాప్త ఉద్యమానికి రైల్వే కార్మికులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాజకీయ నాయకులకు పెన్షన్ కల్పించిన కేంద్రం.. ప్రభుత్వ ఉద్యోగులకు నూతన పెన్షన్ విధానం అమలు చేయడం దారుణమని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అన్ని ట్రేడ్ యూనియన్లు నేషనల్ జాయుంట్ కమిటీగా ఏర్పడి పోరాటానికి సమాయత్తమవుతున్నారని చెప్పారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేంత వరకు పోరాటం ఆగదన్నారు. యూనియన్ జోనల్ అధ్యక్షుడు కాల్వ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.