ఆరోగ్యశ్రీ ఆస్పత్రులపై నిఘా, నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. రాష్ట్ర స్థాయిలో ఒక కమిటీని నియమించి ఆస్పత్రుల్లోని వసతులను పర్యవేక్షించే వ్యవస్థను తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మంగళగిరి ఏపీఐఐసీ భవనంలో సోమవారం ఆరోగ్యశ్రీపై సమీక్ష నిర్వహించారు. వైద్య, ఆరోగ్యశాఖ ఆరోగ్యశ్రీ పథకాన్ని తాము విస్తరిస్తున్నామని, శస్త్ర చికిత్సలను 2446 నుంచి 3255కు చేర్చామని తెలిపారు. ఇప్పుడు ఏకంగా 2260 ఆస్పత్రుల ద్వారా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందుతోందన్నారు. వీటిలో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 202 ఆస్పత్రుల్లోనూ వైద్యం అందజేస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందే ప్రతి రోగి వైద్య పరీక్షలన్నీ ఉచితంగా జరగాల్సిందేనని సష్టం చేశారు. ఈహెచ్‌ఎస్ కార్డుల ద్వారా వైద్యం అందించే విషయంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కష్ణబాబు, ఆరోగ్యశ్రీ సీఈవో హరీంద్రప్రసాద్, ఇతర అధికారులు పాల్గొన్నారు.