దేశంలో సముద్ర తీర జలాలు, గాలి కలుషితమవుతున్నాయని ఆంధ్ర విశ్వవిద్యాలయం సర్ ఆర్థర్ కాటన్ చైర్ ప్రొఫెసర్ రాజేంద్రప్రసాద్ ఆందోళన వ్యక్తంచేశారు. విశాఖ జాతీయ సముద్ర అధ్యయన విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ‘సముద్రంలో మార్పులు.. ప్రమాదాలు’ అనే అంశంపై నిర్వహించిన రెండు రోజుల సదస్సును సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ... తీరప్రాంతాల్లో అటు నగరాలు, ఇటు పారిశ్రామిక వాడలు శరవేగంగా విస్తరించే క్రమంలో మురుగు/రసాయన వ్యర్థజలాలు, ఇతర ఘనవ్యర్థాలు, ప్లాస్టిక్ సముద్రంలో కలుస్తున్నాయన్నారు. దీంతో సముద్ర జలాలతోపాటు గాలి కలుషితవుతోందని చెప్పారు. ఇది సముద్రంలో జీవరాశులపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. తీర ప్రాంతాల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.