రాష్ట్ర ప్రభుత్వం తాను చేయాల్సిన పనులన్నింటికీ అమ్మ ఒడి పథకాన్ని చూపిస్తుంది. ఏది అడిగినా ఆ పథకాన్నే చూపించడం దుర్మార్గం’’ అని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. ‘‘విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థుల బాధ్యత ప్రభుత్వానిదే. ఈ చట్టం కింద ప్రైవేటు పాఠశాలలు పేదలకు కేటాయించిన సీట్లకు ఫీజులను ప్రభుత్వం నేరుగా పాఠశాలలకు చెల్లించాలి. కాని ప్రభుత్వం తన బాధ్యతను విస్మరించి అమ్మ ఒడి డబ్బులను ఈ ఫీజుగా చెల్లించాలని తల్లిదండ్రులకు చెప్పడం సిగ్గుచేటు. పోయిన సంవత్సరం ఈ చట్టం కింద సీట్లు పొందిన వారి ఫీజులు ప్రభుత్వం చెల్లించలేదు. దానితో ఆ చట్టం నీరుగారిపోయింది. ఇప్పటికే రకరకాల సాకులతో అమ్మ ఒడి పథకాన్ని జగన్ ప్రభుత్వం నీరుగార్చింది’’ అంటూ యనమల వివరణాత్మక విమర్శ చేశారు