ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో కుంభకోణం ఏమీ జరగలేదని... దీన్ని ఒక సాకుగా చూపి కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. ఆప్ కీలక నేతలు మనీశ్ సిసోడియా, సత్యేంద్ర జైన్ లను అరెస్ట్ చేయడంపై ఆయన మండిపడ్డారు. ఈ ఇద్దరు వ్యక్తులు దేశానికి ఎంతో కీర్తిని తెచ్చారని... అలాంటి వ్యక్తులను మోదీ జైలుకు పంపారని దుయ్యబట్టారు. విద్యా రంగంలో సిసోడియా, వైద్య రంగంలో సత్యేంద్ర జైన్ మంచి పనులు చేయడమే వారి అరెస్టులకు కారణమని అన్నారు. సిసోడియా బీజేపీలో చేరితే రేపటికి రిలీజ్ అవుతారని చెప్పారు. బీజేపీలో చేరితే ఆయనపై అన్ని కేసులను ఉపసంహరించుకుంటారని ఎద్దేవా చేశారు. ఒకప్పుడు ఇందిరాగాంధీ ఎలా వ్యవహరించారో ఇప్పుడు మోదీ అలాగే వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రతి విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని... ప్రజలే సమాధానం చెపుతారని అన్నారు.