దేశంలోని రాష్ట్రాల అన్ని ముఖ్యమంత్రుల కంటే జగనే అత్యంత ధనవంతుడని, అందుకు ఎన్నికల అఫిడవిట్లో పొందుపరచిన కోట్లాది రూపాయల ఆస్తులు రుజువుచేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి మండిపడ్డారు. పైగా తాను పేదవాడినని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. బుధవారం వేంపల్లి లో ఆయన మాట్లాడుతూ రాబోవు ఎన్నికలు క్లాస్వార్ అంటూ పేదలు ఒకవైపు పెత్తందార్లు మరొకవైపు అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. తాను పేదలవైపు ఉన్నానని, ప్రతిపక్షాలు పెత్తందార్ల పక్షాన ఉన్నాయని జగన్ వ్యాఖ్యానించడం శోచనీయమన్నారు. 2019లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ప్రస్తుతం దేశంలో ముఖ్యమంత్రుల కంటే జగన్ అత్యంత ధనవంతుడని, ఇక అత్యంత పేదరాలు మమతా బెనర్జీ అన్నారు. అప్పటి అఫిడవిట్ ప్రకారం జగన్ ఆస్తి 370కోట్ల రూపాయలని, మమతా బెనర్జీ ఆస్తుల విలువ రూ. 25లక్షల రూపాయలని పేర్కొన్నారు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన అక్రమ సంపాదనకు అడ్డేలేకుండా పోయిందన్నారు.
వైట్ మనీ బ్లాక్ మనీ రెండూ కలిపితే జగన్ ఆస్తి విలువ అంబాని, అదానీ ఆస్తుల కంటే ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు. మాట తప్పడం, మడమ తిప్పడం జగన్ కు దినచర్యగా మారిందన్నారు. అధికారంలోకి వచ్చిన మరుక్షణమే విశ్వనీయత కోల్పోయారన్నారు. జగన్ దృష్టిలో మేనిఫెస్టో ఒక చిత్తుకాగితమ నిన్నారు. ఆయన ప్రవేశపెట్టిన నవరత్నాలకు దిక్కేలేదన్నారు. రైతు భరోసా రైతులను నిరాశకు గురిచేసిందన్నారు. జగన్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ బూటకమని ప్రజలకు అర్థమైందన్నారు. తాను పేదవాడినని అపద్దాలు చెప్పడం మానుకోవాలని సూచించారు.