జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో ఆర్టీసీ బస్సు బైక్‌ను ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయా లయ్యాయి. మృతుని బంధువులు, స్ధానికులు మృతదేహాంతోనే రోడ్డుపై బైఠాయించడంతో మూడు గంటల పాటు కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచి పోయాయి. కామవరపు కోటకు చెందిన చింతల ఏడుకొండలు, చింతలపూడికి చెందిన ఆవుల వెంకన్న (21) శుభ కార్యాలకు డెకరేషన్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం వీరిద్దరూ అలంకరణ చేసేందుకు జంగారెడ్డిగూడెం వచ్చారు. తిరిగి ఇంటికి వెళ్తుండగా దేవులపల్లి వద్ద ఏలూరు నుంచి జంగా రెడ్డిగూడెం వైపు వస్తున్న ఆర్టీసీ ఢీకొట్టింది. దీంతో వారిద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. స్ధానికులు 108 వాహనంలో జంగా రెడ్డిగూడెం ప్రభుత్వ ఆసు పత్రికి తరలించారు. వెంకన్న పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన వైద్యం కోసం ఏలూరు రిఫర్ చేశారు. అంబులెన్స్‌లో వెంకన్నను ఏలూరు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. దీంతో వెంకన్న మృతదేహాన్ని అదే అంబు లెన్స్‌లో జంగారెడ్డిగూడెం తీసుకువస్తూ ప్రమాదం జరిగిన దేవులపల్లి గ్రామంలో ఆపారు. అప్పటికే బంధువులు, స్ధానికులు అక్కడకు చేరుకోవడంతో మృతదేహాన్ని రోడ్డుపై పెట్టి ఆందోళనకు దిగారు. బస్సు డైవ్రర్ నిర్లక్ష్యంతోనే వెంకన్న మృతి చెండాడని, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. జంగారెడ్డిగూడెం ఇన్ చార్జ్ డీఎస్సీ సత్యనారాయణ, సీఐ బాలసురేష్ బాబులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడారు. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.