జగనన్న ఇళ్లు, టిడ్కో ఇళ్ల లబ్ధిదారులపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ.. ఈ నెల 2న సీపీఐ నిర్వహించ తలపెట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. అనంతపురంలోని పార్టీ కార్యాలయం నుంచి రైల్వేస్టేషన్‌కు ర్యాలీగా వెళుతున్న పార్టీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. పార్టీ నాయకుడు జగదీ్‌షను గృహ నిర్బంధం చేశారు. పలు మండలాల నుంచి విజయవాడ వెళుతున్న వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. నంద్యాలలో బుధవారం పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ అభ్యర్థులు పోతుల నాగరాజు, కత్తి నరసింహారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘చలో విజయవాడ’ కార్యక్రమం నేపథ్యంలో రామకృష్ణను పోలీసులు నిర్బంధించారు. దీంతో పోలీసులకు, సీపీఐ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. సీపీఐ నాయకులను పోలీసులు స్టేషన్‌కు తరలించారు.