అనంతపురం జిల్లా, నల్లమాడ మండలంలోని పెమనకుంటపల్లి, అప్పయ్యగారిపల్లికి చెందిన కార్డుదారులు.. రేషన బియ్యం ఇవ్వలేదంటూ బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం గేటు మూసి, ధర్నా చేపట్టారు. కార్డుదారులు మాట్లాడుతూ.. ఐదునెలలుగా రేషన డీలర్ బియ్యం సక్రమంగా ఇవ్వడం లేదని ఆరోపించారు. ప్రతినెలా ఓ పదిమందికి బియ్యం ఇచ్చి, మిగిలినవారికి లేవని చెబుతున్నట్లు మండిపడ్డారు. వీరికి మద్దతుగా మాజీ మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రేషన బియ్యం సక్రమంగా పంపిణీ చేయలేని దుస్థితిలో ఉందన్నారు. ఐదునెలలుగా బియ్యం సక్రమంగా ఇవ్వట్లేదంటే ప్రభుత్వ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించి, కార్డుదారులకు బియ్యం అందించాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ దేవేంద్ర నాయక్‌కు ఫోన చేసి, మాట్లాడారు. నాలుగురోజుల్లోగా బియ్యం పంపిణీ చేయకపోతే ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సొంత డబ్బుతో కార్డుదారులకు బియ్యం ఇస్తానన్నారు. స్పందించిన తహసీల్దార్ నాలుగు రోజుల్లో సమస్య పరిష్కరిస్తానన్నారు.