శ్రీకాకుళం జిల్లా, జలుమూరు, శ్రీముఖలింగం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన పంచాది ఎర్రమ్మ (52) మృతి చెందింది. వివరాల్లోకి వెళ్ళితే..... నగిరికటకంలో వ్యవసాయ కూలి పనులకు వెళుతున్న మహిళలపైకి కొమనాపల్లి నుంచి హిరమండలం వెళుతున్న వ్యాన్ దూసుకు వెళ్లడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన వారు బయటపడ్డారు. మహిళను ఢీకొన్న వాహనం డ్రైవర్ వేగంగా వెళుతుండగా గ్రామస్థులు వెంబడించడంతో గ్రామ శివారులో పులిబంద వద్ద బోల్తా పడింది. డ్రైవర్ నిర్లక్ష్యంగా అతివేగంగా వాహనాన్ని నడపడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా వేగంగా వెళుతున్న వాహనం సైక్లిస్ట్ అల్లు ప్రసాద్‌ను కూడా ఢీకొనడంతో చిన్న గాయాలతో బయటపడ్డాడు. గ్రామస్థులు డ్రైవర్‌ను పట్టుకొని పోలీసులకు సమాచారం అందించారు. వారు సంఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించి వాహన డ్రైవర్‌యూరియల్ నాయక్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈయన ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా సుకాయ గ్రామానికి చెందిన వాడుగా గుర్తించారు. మృతురాలి కోడలు పంచాది ఉమ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ పి.పారినాయుడు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించా రు. మృతురాలికి కుమారుడు, కోడలు ఉన్నారు. కుమారుడు చంద్రశేఖర్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. అత్త ఎర్రమ్మ మృతి చెందడంతో కోడలు లబోదిబోమంటోంది.