పెళ్లి మేకప్ ఓ అమ్మాయి శాపంగా పరిణమించింది. మేకప్ తర్వాత వధువు మొహం చూసి, పెళ్లి రద్దు చేసుకున్నాడు వరుడు. పెళ్లికి కొన్ని గంటల ముందు బ్యూటీపార్లర్‌కు వెళ్లడం.. ఆ అమ్మాయి జీవితాన్ని ఊహించని మలుపుకు తిప్పింది. ఎంత పనైంది..?! కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. హసన్ జిల్లా అరసికరె గ్రామానికి చెందిన ఓ యువతికి కొన్ని రోజుల కిందట పెళ్లి నిశ్చయం చేశారు పెద్దలు. నిశ్చితార్థం వేడుక కూడా ఘనంగా నిర్వహించారు. అబ్బాయి, అమ్మాయి ఫోన్‌లో సమయం తెలియకుండా మాట్లాడుకుంటున్నారు. చూస్తుండగానే.. పెళ్లి ముహూర్త ఘడియలు సమీపించాయి.
మరుసటి రోజు ఉదయం పెళ్లనగా.. అమ్మాయి మేకప్ కోసం స్థానికంగా ఉన్న ఓ బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. అక్కడ పనిచేస్తున్న బ్యూటీషియన్.. పెళ్లి కోసం ఆమెకు కొత్త రకమైన మేకప్ వేస్తానని చెప్పింది. అందులో భాగంగా ముఖానికి తొలుత ఫౌండేషన్ క్రీమ్ రాసింది. ఆ తర్వాత ఆవిరి పట్టింది. ఆ వెంటనే అది బెడిసికొట్టింది. అమ్మాయి ముఖం కాలిపోయి బొబ్బలెక్కింది. ముఖాకృతి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. కుటుంబసభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు.
బ్యూటీ పార్లర్‌లో జరిగిన సంఘటన గురించి వరుడి కుంటుంబసభ్యులకు ఫోన్ చేసి చెప్పారు అమ్మాయి తల్లిదండ్రులు. దీంతో కొన్ని రోజుల పాటు పెళ్లి వాయిదా వేసుకుందామని వాళ్లు చెప్పారు. ఈలోగా అలర్జీ కారణంగా అమ్మాయి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. ఆమెను ఐసీయూలోకి తరలించి చికిత్స ప్రారంభించారు వైద్యులు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అమ్మాయిని పరామర్శించేందుకు వరుడు, అతడి తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. అమ్మాయి మొఖం చూసి వరుడు ఖంగుతిన్నాడు. నిశ్చితార్థం సమయంలో తాను చూసినా అమ్మాయేనా అనే అనుమానం కలిగింది అతడికి. అమ్మాయిని అలా చూసి తీవ్ర మానసిక సంఘర్షణలో పడ్డాడు. చివరికి తనకు ఈ పెళ్లి వద్దంటూ రద్దు చేసుకొని వెళ్లిపోయాడు.
అసలే అమ్మాయి పరిస్థితి చూసి తల్లడిల్లుతున్న తల్లిదండ్రులకు పెళ్లి రద్దు కావడం మరింత కలచివేసింది. తమ కుమార్తెకు అలాంటి పరిస్థితి తీసుకొచ్చిన సదరు బ్యూటీషియన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు బ్యూటీషియన్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. మేకప్ ఏంటో గానీ, అమ్మాయి ప్రాణాల మీదకు తీసుకొచ్చిన బ్యూటీషియన్‌ను కఠినంగా శిక్షించాలని బంధువులు కోరుతున్నారు.
అలెర్జీ కారణంగా యువతికి అలాంటి పరిస్థితి ఎదురైందని వైద్యులు తెలిపారు. శరీర తత్వాన్ని బట్టి కొందరికి కొన్ని రకాల క్రీములు పడవని చెబుతున్నారు. ఎక్స్‌పైరీ డేట్ అయిపోయిన ఉత్పత్తులను ఉపయోగించినా.. ఇలా బెడిసికొట్టే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.