ప్రజాగ్రహం ముందు చైనా ప్రభుత్వం తలవంచకతప్పలేదు. కరోనా వైరస్ కట్టడికి అనుసరించిన జీరో కోవిడ్ విధానంతో విసిగిపోయిన చైనా ప్రజలు గతేడాది నవంబరులో రోడ్లపైకి వచ్చి నిరసనలతో హోరెత్తించిన విషయం తెలిసిందే. నిరసనలు రోజు రోజుకూ ఉద్ధృతం కావడంతో పరిస్థితి చేజారుతుందని గ్రహించిన చైనా.. ఆంక్షలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని వెనుక అధికార కమ్యూనిస్ట్ పార్టీ పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీలో ఇటీవలే నెంబర్ 2గా ఎదిగిన లీ కియాంగ్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు.
అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ విధించిన జీరో-కోవిడ్ పాలసీని ఎత్తివేసి మార్చి నాటికి సాధారణ స్థితికి తిరిగి రావాలనే లక్ష్యంతో గతేడాది డిసెంబరులో క్రమంగా ఆంక్షలు సడలించాలని చైనా ఉన్నతాధికారులు, వైద్య నిపుణులు ప్రణాళికలు రచించినట్టు రాయిటర్స్ కథనం పేర్కొంది. కాగా, ఈ నెలలోనే చైనా కొత్త ప్రీమియర్‌గా లీ కియాంగ్‌ను ఎంపిక చేయబోతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిన జీరో కోవిడ్ పాలసీ, నిరసనల అరికట్టడానికి ఆంక్షలను సడలించే ప్రణాళికలను అమలు చేయాలనే నిర్ణయాన్ని అకస్మాత్తుగా తీసుకున్నారని తెలిపింది.
ఈ విషయం గురించి నలుగురు వ్యక్తులకు మాత్రమే తెలుసని ఓ అధికారి వ్యక్తి చెప్పారు. తత్ఫలితంగా డిసెంబర్‌లో అకస్మాత్తుగా లాక్‌డౌన్‌లు, సామూహిక కోవిడ్ పరీక్షలు, ఇతర ఆంక్షలను ముగించింది. చైనా తన జీరో కోవిడ్ విధానంపై యూటర్న్ వెనుక గల నిర్ణయాధికార ప్రక్రియను మాత్రం బహిరంగంగా ప్రకటించలేదు. అలాగే, లాక్‌డౌన్ ఆంక్షలు సడలింపునకు సంబంధించిన చర్చల విషయంలో స్టేట్ కౌన్సిల్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ (SCIO) సమర్పించిన నివేదికపై జిన్‌పింగ్, లీ కియాంగ్ సహా చైనా క్యాబినెట్ స్పందించడానికి నిరాకరించిందని రాయిటర్స్ పేర్కొంది.
ఉన్నతాధికారులు, ఆరోగ్య నిపుణుల మధ్య చర్చల అనంతరం.. జీరో కోవిడ్ ఆంక్షల ఎత్తివేతపై లీ అభిప్రాయంతో జిన్‌పింగ్ ఏకీభవించలేదని, ఇది చాలా సున్నితమైన అంశం కావడంతో ఓ అజ్ఞాత వ్యక్తి తన పేరు చెప్పకుండా మాట్లాడారని రాయిటర్స్ తెలిపింది. ‘‘అగ్ర నాయకులు చివరికి యువత నిరసనలను శాంతింపజేసేలా ఆంక్షలను ఎత్తివేయాలని నిర్ణయించారు.. ఎందుకంటే అసమ్మతివాదుల ముప్పు వైరస్ వ్యాప్తికి అనుమతించడం కంటే రాజకీయంగా ప్రమాదకరమని భావించారు.’’ అని తెలిపాయి.