ఢిల్లీలో ఇవాళ చోటు చేసుకున్న పరిణామాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సహచరులకు పలు సూచనలు చేశారు. సున్నితమైన అంశాలపై జాగ్రత్తగా మాట్లాడాలని స్పష్టం చేశారు. మనం మంచి ఉద్దేశంతో మాట్లాడినా, చెడుగా ప్రచారం చేసేవారు ఉంటారని తెలిపారు. వ్యవసాయం దండగ అని అనకపోయినా, నేను ఆ మాట అన్నట్టుగా ప్రచారం చేశారని చంద్రబాబు వెల్లడించారు. కాంగ్రెస్ హయాంలో అంబేద్కర్ కు తగిన గౌరవం లభించలేదని, అప్పట్లో అంబేద్కర్ ఓడిపోయింది కూడా కాంగ్రెస్ హయాంలోనే అని గుర్తు చేశారు. వీపీ సింగ్ హయాంలో పార్లమెంటు ఆవరణలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని తెలిపారు. అంబేద్కర్ కు ఎవరిద్వారా గుర్తింపు వచ్చిందనే అంశంపై జరగాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. కేంద్రమంత్రి అమిత్ షా... అంబేద్కర్ పై వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం తెలిసిందే. ఇవాళ పార్లమెంటు ప్రాంగణంలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల మధ్య తోపులాట జరిగి పలువురు ఎంపీలు గాయపడి ఆసుపత్రిపాలయ్యారు. అమిత్ షాపై కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరుగుతున్న నేపథ్యంలో, చంద్రబాబు వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.