మంచు మనోజ్ తన అత్తగారి ప్రాంతమైన కర్నూలు జిల్లాలో సందడి చేశారు. మనోజ్, భూమా మౌనికా రెడ్డికి వివాహం అనంతరం.. మౌనికా రెడ్డి తాత, మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డిని కలిసేందుకు నూతన దంపతులు ఆళ్లగడ్డకు వచ్చారు. ఎస్వీ సుబ్బారెడ్డి ఆశీర్వాదం తీసుకున్నారు. వీరితో పాటు తెలంగాణ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఉన్నారు. ఎస్వీ సుబ్బారెడ్డి ఇంట్లో అల్పాహారం అనంతరం.. భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి ఘాట్ వద్దకు వెళ్లారు. అక్కడ మంచు మనోజ్ దంపతులు నివాళులు అర్పించారు.
పెళ్లి తర్వాత తొలిసారి తన భార్య మౌనికతో కలిసి.. మనోజ్ అత్తారింటికి వచ్చారు. మంచు లక్ష్మీ ఇంటి నుంచి భారీ కాన్వాయ్‌తో నూతన దంపతులు కర్నూలుకు వచ్చారు. పుల్లూరు టోల్ ప్లాజా వద్ద మనోజ్ దంపతులకు అభిమానులు ఘన స్వాగతం పలికారు. కర్నూలు వెళ్లగానే ముందుగా శోభా నాగిరెడ్డి తండ్రి ఇంటికి వెళ్లి వారి ఆశీస్సులు తీసుకున్నారు. అందరి ఆశీస్సులతో మౌనికతో వివాహం జరిగిందని మంచు మనోజ్ వ్యాఖ్యానించారు. కర్నూలు నుంచి ఆళ్లగడ్డ, కడప.. ఆ తర్వాత తిరుపతికి వెళ్లనున్నట్లు చెప్పారు.