ఏపీలో ఎన్నికలకు నోట్ల వరద పారుతుందన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. తాాజాగా పట్టభద్రుల, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల వేళ.. ఓ ఆటోలో తరలిస్తున్న రూ.500 నోట్లు గాలిలో ఎగురుకుంటూ జాతీయ రహదారిపై చెల్లాచెదురుగా పడ్డాయి. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మడపాం టోల్‌గేట్ వద్ద శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. శ్రీకాకుళం వైపు నుంచి నరసన్నపేట వైపు వస్తున్న ఓ ఆటోలో నుంచి రూ.500 నోట్లు ఎగిరిపడ్డాయి. వాటిని గుర్తించిన టోల్‌గేట్ సిబ్బంది.. కరెన్సీ నోట్ల ను సేకరించారు. మరికొంత మంది ఆటోను వెంబడించారు. అయినా ఫలితం లేకపోయింది. ఆ ఆటో ఆగలేదు. అయితే.. ఈ డబ్బు ఎవరికి చెందిందన్నది ప్రశ్నార్థకంగా మారింది.
దీనిపై టోల్ గేట్ సూపర్‌వైజర్ ఢిల్లేశ్వరరావు, కృష్ణారావు.. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఆటో వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదని స్థానిక ఎస్సై సింహాచలం వివరించారు. ఆటోకు ముందు ఓ ద్విచక్ర వాహనం ప్రయాణిస్తున్నట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు చెందిన సొమ్ము అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టోల్‌గేట్ సిబ్బంది సేకరించిన రూ.88 వేల నగదును పోలీసు స్టేషన్‌లో అప్పగించారు. ఈ నగదు గురించి ఎవరైనా స్పష్టమైన ఆధారాలతో వస్తే అప్పగిస్తామని పోలీసులు చెబుతున్నారు.