మైదుకూరు మండలం ఉత్సలవరం గ్రామంలో 16వ శతాబ్దం నాటి వినాయకుని విగ్రహం గుర్తించినట్లు చరిత్ర పరిశోధకులు , రచయిత బొమ్మిశెట్టి రమేష్ సోమవారం మీడియా కు తెలిపారు. ఈ సందర్భంగా బొమ్మిశెట్టి మాట్లాడుతూ. ఈ విగ్రహం ఉత్సలవరం గ్రామంలోని పుట్టా రామకృష్ణ , శీను ల పశువుల జాగాలో తూర్పు వైపు ఉందని తెలిపారు. 16వ శతాబ్దంలో ఇక్కడ దేదీప్యమానంగా వినాయకుని ఆలయం వెలుగుందన్నారు. కాలక్రమేనా ఈ దేవాలయం శిథిలావస్థకు చేరి వినాయకుని ప్రతిమ కొంత వరకు మాత్రమే కనబడుతూ వచ్చిందన్నారు.
గుప్తనిధుల కోసం తవ్వడంతో వినాయకుని విగ్రహం పూర్తిగా పైకి కనబడుతుందని తెలిపారు. ఈ విగ్రహంలో ఎడమ చేతిలో శంఖం, కుడి చేతిలో డమరుకం ఉన్నట్లు రమేష్ వివరించారు. విగ్రహం గురించి గ్రామ స్థానికులు కత్తి మధుసూదన్ రెడ్డి తనకు చెప్పడంతో విగ్రహాన్ని పరిశీలించాలని బొమ్మిశెట్టి చెప్పారు. మైసూర్ పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నంరెడ్డికి విగ్రహం గురించి చెప్పానని రమేష్ తెలిపారు. దీంతో డైరెక్టర్ నిశితంగా పరిశీలించి ఇది 16వ శతాబ్దందని తేల్చి చెప్పినట్టు తెలిపారు.