అమలాపురం అల్లర్ల కేసుకు త్వరలోనే ముగింపు పలుకుతామని.. వైఎస్సార్సీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్.. ఎంపీ మిథున్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కొద్దిరోజుల కిందట మంత్రి విశ్వరూప్, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్.. సీఎం జగన్‌ను కలిశారని.. అల్లర్ల కేసులో కొందరు అమాయకుల పేర్లు ఉన్నాయని.. దీనివల్ల యువత భవిష్యత్తు పాడవుతుందని సీఎంకు వివరించారని చెప్పారు. వారిపై నమోదైన కేసులను ఉపసంహరించాలని కోరినట్టు మిథున్ రెడ్డి వెల్లడించారు. దీంతో త్వరలోనే ఈ కేసుకు ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉందని చెప్పారు.
కోనసీమ జిల్లా పేరును జిల్లాగా మార్చడాన్ని నిరసిస్తూ.. గతేడాది మే 24న అమలాపురంలో ఆందోళనలు జరిగాయి. కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం హింసాత్మకంగా మారింది. మంత్రి విశ్వరూప్ రెండు ఇళ్లను ఆందోళనకారులు దగ్దం చేశారు. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ ఇంటిని కూడా దగ్దం చేశారు. వాహనాలను తగలబెట్టారు. ఈ కేసులో వైసీపీకి చెందిన వారు కూడా ఉన్నారని ప్రచారం జరిగింది. మంత్రి విశ్వరూప్ అనుచరులుగా ఉన్న సత్యరుషి, సుభాష్, మురళీ కృష్ణ, రఘును కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
అమలాపురం ఘటనకు సంబంధించి.. నిందితులు వాట్సాప్ ఆధారంగా ప్లాన్ చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఎప్పుడు ఎలా చేయాలో కూడా వాట్సాప్‌లో చాట్ చేశారని దర్యాప్తులో గుర్తించారు. ఈ అల్లర్ల కేసులో మైనర్లు ఉండటం కలకలం రేపింది. దీంతో స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ కేసుపై దృష్టి పెట్టారు. అమాయకులు, మైనర్లు ఉన్నారని.. వీరికి ఉపశమనం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసుపై సీఎం జగన్ త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేసు మూసేస్తే.. చాలా మందికి విముక్తి కలగనుంది.