సుపారీ గ్యాంగ్‌ను ఏలూరు పోలీసులు అరెస్టు చేశారు. డబ్బుల కోసం హత్యలు చేయడానికి కూడా వెనుకాడని బ్యాచ్‌లు తయారయ్యాయి. అటువంటి సుపారీ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్టు చేసి వారి నుంచి కత్తులు స్వాధీనం చేసుకున్నారు. ఏలూరులో సోమవారం విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మవివరాలు వెల్లడించారు. కామవరపుకోట మండలానికి చెందిన శివశంకర శ్రీనివాసరావు అలియాస్ సాయి ఒక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అడ్డుగా ఉన్నాడని ప్రియురాలి భర్తను హతమార్చాలని ప్లాన్ వేశాడు. జంగారెడ్డిగూడేనికి చెందిన పాత నేరస్తుల సహాయంతో ఏలూరులోని ఒక రౌడీ షీటర్‌తో హత్యకు పథకం పన్నారు. 15 లక్షలు ఇస్తే హతమారుస్తామని చెప్పగా అయితే తన వద్ద అంతలేదని 9 లక్షలకు శ్రీనివాసరావు ఒప్పందం చేసుకున్నాడు. నాలుగు లక్షల 50 వేలు అడ్వాన్సు చెల్లించాడు. ఈ ఏడాది జనవరిలో హత్య చేయడానికి స్కెచ్ వేయగా అది ఫెయిలైంది. దీంతో సోమవారం ఏలూరు శివారు హైవే పక్కన హత్య చేసేందుకు స్కెచ్ వేశారు. విషయం పోలీసులకు తెలిసింది. దీంతో వన్‌టౌన్, రూరల్ సీఐ తమ సిబ్బందితో కలిసి సుపారీ గ్యాంగ్‌ను చాకచక్యంగా అరెస్టు చేశారు. కామవరపుకోటకు చెందిన శ్రీనివాసరావు, జంగారెడ్డిగూడేనికి చెందిన వీపు వెంకటేష్, ఏలూరు చాపల మార్కెట్ వెనుక షేక్ యాకోబ్ జాన్, కత్తేపు వీధికి చెందిన షేక్ బాజీ, కత్తేపు వీధి సీఎస్‌ఐ చర్చి సమీపానికి చెందిన కొట్టు ప్రశాంత కుమార్, జంగా రెడ్డిగూడేనికి చెందిన షేక్ బాషాను అరెస్టు చేశారు. ఏలూరుకు చెందిన వీరంకి నాగార్జున పరారీలో ఉన్నాడు.వీరి నుంచి నాలుగు కత్తులు, రెండు మోటారు సైకిళ్లు, మూడు సెల్‌ఫోన్లు, లక్షా 20 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.