పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ మార్చి 13న జరుగనున్న దృష్ట్యా ఆరోజున తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా గ్రాడ్యుయేట్ ఓటర్లయిన ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేక క్యాజువల్ లీవ్‌ను ఎన్నికల సంఘం మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఏ సూర్యకుమారి తెలిపారు. పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటు హక్కు వున్న ప్రభుత్వ ఉద్యోగులకి ఇది వర్తిస్తుందని పేర్కొన్నారు. అదేవిధంగా శాసనమండలి ఎన్నికల పోలింగ్ సందర్భంగా ప్రైవేటు, వాణిజ్య, పారిశ్రామిక సంస్థల్లో ఉద్యోగులైన ఓటర్లకు ఆరోజు సెలవు ప్రకటించేందుకు నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ చట్టం ప్రకారం ఎలాంటి అవకాశం లేదని, అందువల్ల ఆయా ప్రయివేటు, వర్తక, వాణిజ్య, పారిశ్రామిక సంస్థలు తమ ఉద్యోగులు ఓటు వేసేందుకు వీలుగా ప్రత్యేక అనుమతి ఇవ్వాలని సూచించారు. పోలింగ్ రోజున వారు ఓటు వేసిన అనంతరం కొంత ఆలస్యంగా విధుల్లోకి వచ్చేందుకు అనుమతించడం వంటి వెసులుబాట్లు కల్పించాలన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు.