ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్రమ వలసల నివారణకు బ్రిటన్‌లో చట్టం,,,విమర్శలకు గురవుతున్న సునాక్ నిర్ణయం

international |  Suryaa Desk  | Published : Wed, Mar 08, 2023, 09:22 PM

అక్రమ వలసను అరికట్టేందుకు బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తీసుకున్న నిర్ణయం విమర్శలకు దారితీస్తోంది. బ్రిటన్‌లోకి అక్రమంగా ప్రవేశించే వారిని ఆశ్రయం పొందేందుకు ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని సునాక్ గట్టి హెచ్చరికలు చేశారు. ఈ మేరకు కొత్త చట్టాన్ని తీసుకురాగా.. అక్రమ చొరబాట్లను ఉక్కుపాదంతో అణిచివేసేందుకు యూకే ప్రభుత్వానికి హక్కు లభించినట్లయ్యింది. అయితే ఈ చట్టంపై ప్రతిపక్షాలు, మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.


‘‘మీరు చట్టవిరుద్ధంగా ఇక్కడకు వస్తే.. ఆశ్రయం పొందలేరు. ఆధునిక బానిసత్వ రక్షణల నుంచి ప్రయోజనం పొందలేరు.. మీరు నకిలీ మానవ హక్కుల దావాలు చేయలేరు.. ఇక్కడ ఉండలేరు’’ అంటూ రిషి సునాక్ ట్వీట్‌ చేశారు. ‘చట్టవిరుద్ధంగా ఇక్కడికి ప్రవేశించేవాళ్లను అదుపులోకి తీసుకుని.. కొన్ని వారాలలోపు వారిని పంపించేస్తాం... సురక్షితమని భావిస్తే.. వాళ్లను సొంత దేశానికే పంపిస్తాం.. కుదరకుంటే రువాండా లాంటి మరో దేశానికి తరలిస్తాం.. అమెరికా, ఆస్ట్రేలియాలో ఉన్నాసరే మా దేశంలోకి మళ్లీ ప్రవేశించకుండా నిషేధిస్తాం’ అంటూ హెచ్చరించారు.


అక్రమ వలసల బిల్లుగా పిలవడబడుతున్న ముసాయిదా చట్టం.. ఇంగ్లీష్‌ ఛానెల్‌ గుండా చిన్నచిన్న బోట్ల ద్వారా అక్రమంగా ప్రవేశించే వాళ్లపై ప్రత్యేకంగా దృష్టిసారించనుంది. ఇదిలా ఉండగా.. గతేడాది సౌత్‌ఈస్ట్‌ ఇంగ్లండ్‌ గుండా 45 వేలమంది వలసదారులు బ్రిటన్‌కు చేరుకున్నారు. గత ఐదేళ్లలతో పోల్చితే వార్షికంగా 60 శాతం పెరిగిందని నివేదికలు పేర్కొన్నాయి.


రిషి సునాక్‌ తీసుకొచ్చిన కొత్త పథకంపై మానవ హక్కుల సంఘాలు, బ్రిటన్‌ ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. కొత్త చట్టం అమలయ్యే అవకాశమే లేదని, అంతర్జాతీయ సమాజం నుంచి అభ్యంతరం వ్యక్తం కావొచ్చని ప్రధాన ప్రతిపక్షం లేబర్‌ పార్టీ వ్యాఖ్యానించింది. మరోవైపు, ఈచట్టంతో దుర్బల పరిస్థితుల్లో ఉన్న శరణార్థులు బలి పశువులు అవుతారంటూ మానవ హక్కుల సంఘాలు వాదిస్తున్నాయి. యూరోపియన్ మానవ హక్కుల చట్టంలోని ఇతర హక్కులను తుంగలో తొక్కారని విమర్శిస్తున్నాయి.


‘ప్రస్తుత పరిస్థితి నైతికమైనది లేదా స్థిరమైనది కాదు. ఇది కొనసాగదు.. ఇది మా సహాయం అత్యవవసరమైన వారికి అన్యాయం, కానీ ఇంగ్లీ ఛానెల్‌‌ ద్వారా చట్టవిరుద్ధంగా ప్రయాణించే వారితో మా వ్యవస్థ ఒత్తిడిని ఎదుర్కొంటోంది’ అని సునాక్ అన్నారు. బ్రిటన్‌ హోం మంత్రి, భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్‌మాన్ మంగళవారం కొత్త చట్టాన్ని ప్రకటించారు. అక్రమ వలసల కట్టడి బిల్లు ప్రకారం.. చిన్న చిన్న పడవలపై అక్రమంగా యూకేలోకి ప్రవేశించే వలసదారులను అదుపులోకి తీసుకుని.. వాళ్లను వీలైనంత త్వరగా బయటకు పంపించేస్తారు. ఈ చట్టం చట్టవిరుద్ధమైన వలసలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన బలమైన విధానమని బ్రేవర్‌మాన్‌ పేర్కొన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa