పశ్చిమ గోదావరి జిల్లా, పెనుగొండ నగరేశ్వర మహిషాసురమర్దని, వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలపై విచారణ చేపట్టాలని అడ్వకేట్ ఇండుగపల్లి రామానుజరావు డిమాండ్ చేశారు. స్థానిక కోదండ రామాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమ్మ వారికి సమర్పించిన ఖరీదైన పట్టు చీరలను అక్రమ మార్గంలో దేవాలయ ఈవో తరలిస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడం లేదు. కరోనా బూచి చూపి టెండర్లు పిలవకుండా దేవాలయానికి కావాల్సిన సామగ్రిని సొంత మనుషులు దగ్గర నుంచి కొంటున్నారు. ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్న కోయంబత్తూర్, వాసవి తిరుప్పన్ కమిటీ సొమ్ముపై పెత్తనం చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో విగ్రహాలను ప్రతిష్టించే ఉద్దేశంతో నిర్మిస్తున్న కట్టడాలు వాస్తు ప్రకారం లేవు. వీటిపై సమగ్ర దర్యాప్తు చేయించాలి’ అని ఆయన డిమాండ్ చేశారు. దీనిపై ఆలయ ఈవో శ్రీనివాస్ మాట్లాడుతూ అడ్వకేట్ రామానుజరావు చేస్తున్న ఆరో పణలన్నీ అవాస్తవాలన్నారు. పాలక మండలి ఆదేశాల మేరకే దేవ స్థానాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావడం లేదు.