చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలంలో ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ, తిరుపతి)ని భారత ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డీఎస్టీ) కార్యదర్శి డాక్టర్ ఎస్.చంద్రశేఖర్ సందర్శించారు. క్యాంప్‌సలో ఏర్పాటు చేసిన పలు పరిశోధనా లేబొరేటరీలను పరిశీలించి.. అధ్యాపకులను అభినందించారు. ప్రత్యేకించి క్యాంప్‌సలో పరిశోధనల కోసం 10వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్న సెంట్రల్ ఇన్‌స్ర్టుమెంటేషన్ లేబొరేటరీని సందర్శించి, అధ్యాపకులతో సమావేశమయ్యారు. డీఎస్టీకి అనుబంధంగా ఎస్‌ఈఆర్‌బీ ఏడాది పొడవునా పలు పథకాలను కొనసాగిస్తుందని దీన్ని యువశాస్త్రవేత్తలు, అధ్యాపకులు సద్వినియోగం చేసుకుని కొత్త పరిశోధనలు చేయాలని సూచనలు చేశారు. పరిశోధనా పరికరాలపై జీఎస్టీ సమస్యను ఇప్పటికే వివిధ ఫోరమ్‌లలో చర్చించామని, దీనిపై కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు. కొత్త పరిశోధనా ప్రాజెక్టులపై డీఎస్టీ చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఐఐటీ డైరెక్టర్ కేఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ.. ముంపు ప్రాంతాలపై తిరుపతి ఐఐటీలో చేపడుతున్న డీఆర్డీవో, సైంటిఫిక్ ప్రాజెక్టులను వివరించారు. అధ్యాపకుల భాగస్వామ్యంతో క్లస్టర్ సంస్థల ద్వారా ఇంటర్ డిసిప్లినరీ పరిశోధనా ప్రాజెక్టులు తీసుకురావడంలో ప్రధానపాత్ర పోషిస్తున్నట్లు తెలిపారు. అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.