ఎమ్మెల్సీ ఎన్నికల కోసం తిరుపతిలోని కేబీ లేఅవుట్‌లోని ఓ మహిళకు 18 మంది భర్తలున్నట్లు నమోదు చేయడం సిగ్గు చేటు’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం ఆయన తిరుపతిలోని కొన్ని డివిజన్లలో పర్యటించారు. ఓ ఇంట్లో 30, మరో నివాసంలో 11 ఓట్లు నమోదు చేసుండటాన్ని పరిశీలించారు. యశోదనగర్ అయితే 18-1-90/12జి ఖాళీ ప్రదేశంలో పది దొంగ ఓట్లున్నట్లు, ఒకటో క్రాస్ వలంటీర్ ఇంట్లో 12 ఓట్లు, సీపీఎం ఆఫీసు పక్కన లక్ష్మి ఇంట్లో ఎనిమిది దొంగ ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటమి భయంతోనే ఏ చదువూ లేనివారికీ వైసీపీ ప్రభుత్వం గ్రాడ్యుయేట్ ఓటు అర్హత కల్పించడం దారుణమన్నారు. నగరంలోనే ఏడువేల దొంగ ఓట్లున్నట్లు విమర్శించారు. దొంగ ఓట్ల నమోదుకు సహకరించిన అధికారిని ఉరితీయాలన్నారు. టీటీడీ చైర్మన్‌గా పనిచేసిన ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి నియోజకవర్గంలో దొంగ ఓట్ల దందా కొనసాగుతుండడం దుర్మార్గమన్నారు.