ఉప-రాష్ట్రపతి జగదీప్ దన్ఖడ్ బెంగాల్ గవర్నర్‌గా ఉన్నప్పుడు వివాదాలతో నిరంతరం వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా, ఆయన మరో వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. రాజ్యసభ ఛైర్మన్ హోదాలో రాజ్యసభ కమిటీలకు అనుబంధంగా తన వ్యక్తిగత సిబ్బందిని నియమించడం ద్వారా కొత్త సంప్రదాయానికి తెరతీశారు జగదీప్ ధన్ఖఢ్. 20 రాజ్యసభ కమిటీలకు అనుబంధంగా 8 మంది తన వ్యక్తిగత సిబ్బందిని ఆయన నియమించారు. రాజ్యసభ సెక్రటేరియట్ మంగళవారం అర్ధరాత్రి విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం.. ఉపరాష్ట్రపతి కార్యాలయంలోని నలుగురితోసహా 8 మంది ఈ 20 కమిటీల్లో కొనసాగుతారు.
నాలుగు పార్లమెంటరీ కమిటీలు, మరో నాలుగు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో నియమితులైన వారిలో ఉపరాష్ట్రపతి ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ, వ్యక్తిగత కార్యదర్శి, రాజ్యసభ ఛైర్మన్ ఓఎస్‌డీ ఉన్నారు. ఎక్కువగా ప్రతిపక్ష నేతలు నేతృత్వం వహించే ఈ కమిటీల్లో వాస్తవానికి రాజ్యసభ సెక్రటేరియట్ సిబ్బంది సహాయకులుగా ఉంటారు. ఈ సంప్రదాయాన్ని తోసిరాజని ఉపరాష్ట్రపతి కొత్తగా తన సిబ్బందిని ఈ కమిటీల్లోకి వారిని సభ్యులుగా చేర్పించారు. వీరంతా జూనియర్ స్థాయి అధికారులే.
కమిటీలపై నిఘా కోసమే ఉపరాష్ట్రపతి ఈ నియామకాలు జరిపారని ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఇవి సంప్రదాయాలకు విరుద్ధంగా జరిపిన నియామకాలని విమర్శించారు. దీనివల్ల రహస్యంగా ఉండాల్సిన కమిటీల కార్యకలాపాలు బహిరంగమవుతాయని ధ్వజమెత్తారు. కమిటీ చర్చల్లో వివిధ పరిణామాలను రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు తెలియజేసే ప్రస్తుత అధికార యంత్రాంగంపై ఉప-రాష్ట్రపతికి విశ్వాసం లేదని ఇది స్పష్టంగా తెలియజేస్తోందని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు.
2014లో 67 శాతంగా ఉన్న బిల్లుల పరిశీలన ఇప్పుడు 14 శాతానికి పడిపోయిందని తృణమూల్ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. దన్ఖడ్‌కు ముందు వెంకయ్య నాయుడు హయాంలో గత ఐదేళ్లుగా రూల్ 267 కింద ఎలాంటి చర్చ కూడా జరగలేదు. ఈ విషయమై తృణమూల్ పార్టీ ప్రకటన విడుదల చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.