సినిమా సీన్ బెంగళూరు ట్రాఫిక్ జాంలో రిపీట్ అయింది. ఇకపోతే బెంగళూరు నగరవాసులకు ట్రాఫిక్ కష్టాలు వర్ణనాతీతం. అయితే, ఓ వరుడికి బెంగళూరులో ట్రాఫిక్ వరంలా మారి.. పారిపోవడానికి సహకరించడం గమనార్హం. ఫిబ్రవరి 16న మహదేవపురాలోని టెక్ కారిడార్‌లో కారు ఇరుక్కుపోగా.. పెళ్లి ఇష్టంలేని వరుడు ఇదే అదునుగా భావించి పారిపోయాడు. అతడ్ని పట్టుకోడానికి వధువు ప్రయత్నించి విఫలమైంది. భర్తను వెంబడించిన ఆమె.. అతడి వేగాన్ని మాత్రం అందుకోలేకపోయింది. దీంతో రెండు వారాలుగా అతడు ఎక్కడ ఉన్నాడో ఆచూకీ తెలియరాలేదు. గత నెల 16న జరిగిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. చిక్‌బళ్లాపూర్ జిల్లాలోని చింతామణికి చెందిన విజయ్ జార్జ్ అనే యువకుడికి ఫిబ్రవరి 15న వివాహం జరిగింది.
మర్నాడు కొత్త దంపతులు ఇద్దరూ చర్చికి వెళ్లి తిరిగొస్తున్నారు. ఈ క్రమంలో వీరి కారు మహాదేవపుర టెక్ కారిడార్ వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకుంది. ఈ సమయంలో ముందు సీటులో కూర్చున్న విజయ్ జార్జ్.. ఠక్కున డోరు తీసుకుని బయటకు పరుగులు తీశాడు. భర్త అలా చేయడంతో షాక్‌లోకి వెళ్లిపోయిన యువతి.. వెంటనే తేరుకుని అతడి వెంట పరుగులు తీసింది. అయినా అందుకోలేకపోయింది. రెండు వారాలు దాటినా భర్త ఆచూకీ తెలియకపోవడంతో ఆమె మార్చి 5న పోలీసులకు ఫిర్యాదు చేసింది.
‘‘విజయ్ జార్జ్ తండ్రి కర్ణాటక, గోవాలో మ్యాన్‌పవర్ ఏజెన్సీలను నిర్వహిస్తుండగా.. గోవాలో పనిచేసే మహిళా ఉద్యోగితో సంబంధం పెట్టుకున్నాడు. ఏకంతంగా ఉన్నప్పుడు తీసిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని జార్జ్‌ను ప్రియురాలు బెదిరించింది.. దీంతో భయపడిపోయిన అతను పారిపోయాడు’’ అని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఫిబ్రవరి 15న తమ వివాహం జరిగిందని, మాజీ ప్రియురాలు తనను బెదిరిస్తోందని జార్జ్ చెప్పాడని తెలిపింది. నేను, నా తల్లిదండ్రులు ఈ విషయంలో ఆందోళనకు గురికావద్దని ఆయనకు భరోసా ఇచ్చామని చెప్పింది.
విజయ్ జార్జ్ తండ్రి నడుపుతున్న మ్యాన్‌పవర్ ఏజెన్సీ పనుల్లో సహకరిస్తూ.. గోవాలో పనిచేసే కారు డ్రైవర్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని వివరించింది. ఆమెకు ఇద్దరు పిల్లలని, తను కూడా ఆ ఏజెన్సీలో క్లర్క్‌గా పనిచేస్తోందని తెలిపింది. ఈ వ్యవహారం గురించి విజయ్ తల్లికి తెలియడంతో కొడుకును మందలించింది. దీంతో ఆ సంబంధాన్ని ముగించుకుంటానని హామీ ఇచ్చి పెళ్లికి ఒప్పుకున్నాడు. ప్రియురాలి అడ్డుపడుతుందేమోనని భావించిన జార్జ్ కుటుంబం వేరే చోట పెళ్లికి ఏర్పాటు చేసిందని అతని భార్య తెలిపింది.
‘‘పెళ్లికి ముందే ఈ వ్యవహారం గురించి నాకు తెలిసింది.. కానీ ఆమెను విడిచిపెడతానని హామీ ఇవ్వడంతో నేను విజయ్‌ను పెళ్లి చేసుకోవడానికి అంగీకరించాను.. బ్లాక్ మెయిల్‌కి భయపడి జార్జ్ పారిపోయాడు.. అతను ఆత్మహత్య చేసుకునే ఆలోచనలో ఉన్నాడు.. అతను క్షేమంగా ఉన్నాడని, త్వరలో తిరిగి వస్తాడని ఆశిస్తున్నాను’’ నవ వధువు వాపోయింది.