కేరళ రాష్ట్రంలోని పలు జిల్లాలలో సూర్యుడు ఉగ్రరూపం దాల్చాడు. కొద్ది నెలల కిందట భారీ వర్షాలను చవిచూసిన కేరళలో ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితి నెలకుంది. ఉష్ణోగ్రతలు అపూర్వమైన స్థాయికి చేరుకోవడంతో తీవ్రమైన వేడి పరిస్థితులను ఎదుర్కొంటోంది. వేసవి ఇప్పటికే దంచికొడుతుండగా.. రోజువారీ హీట్ ఇండెక్స్ ఆందోళనకరంగా మారింది. కేరళ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ గురువారం రూపొందించిన నివేదిక ప్రకారం.. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో 54 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. ఆరోగ్యం ఇది తీవ్ర ప్రభావం చూపడమే కాదు, వడదెబ్బకు గురిచేస్తుంది.
హీట్ ఇండెక్స్ అనేది వాతావరణ ఉష్ణోగ్రత, తేమ మిశ్రమ ప్రభావం. అనేక అభివృద్ధి చెందిన దేశాలు ప్రజారోగ్య హెచ్చరికలను జారీ చేయడానికి, ఉష్ణోగ్రతల తీవ్రతను రికార్డ్ చేయడానికి దీనిని ఉపయోగిస్తాయి. దీని ప్రకారం.. తిరువనంతపురం జిల్లా దక్షిణ ప్రాంతం, అలప్పుజా, కొట్టాయం, కన్నూర్ జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో 54 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతోంది.
తిరువనంతపురం, కొల్లం, అలప్పూజ, కొట్టాయం, ఎర్నాకులం, కోజికోడ్, కన్నూరులోని చాలా ప్రాంతాల్లో గురువారం ఉష్ణోగ్రతలు 45 నుంచి 54 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. ఈ ప్రదేశాలలో ఎక్కువసేపు బయట తిరగడం, కార్యకలాపాలు కొనసాగిస్తే వడదెబ్బకు దారితీయవచ్చు. సాధారణంగా కాసర్‌గడ్, కోజికోడ్, మలప్పురం, కొల్లాం, పతనంతిట్ట, ఎర్నాకులంలో హీట్ ఇండెక్స్ 40-45 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. దీని వల్ల ఎక్కువసేపు ఎండలో ఉంటే అలసటకు దారితీస్తుంది.
కొండ ప్రాంత జిల్లాలైన ఇడుక్కి, వాయనాడ్‌లోని కొన్ని ప్రాంతాల్లోనే 29 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వేసవిలో సాధారణ పరిస్థితికి విరుద్ధంగా పాలక్కాడ్ ఈ ఏడాది ఇప్పటి వరకూ వేసవి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నాయి. ఆ జిల్లాలో 30-40 డిగ్రీల సెల్సియస్ హీట్ ఇండెక్స్, ఇడుక్కి జిల్లాలో ఎక్కువ భాగం కూడా ఇదే స్థాయిలో ఉంది.
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ఈ హీట్ ఇండెక్స్ మ్యాప్‌ని కేఎస్‌డీఎంఏ.. భారత వాతావరణ శాఖ ఆటోమేటిక్ వాతావరణ మ్యాపింగ్ సౌకర్యాలను ఉపయోగించి సిద్ధం చేస్తుంది. ఈ నివేదికపై వ్యాఖ్యానించడానికి ఐఎండీ తిరువనంతపురం నిరాకరించింది. ప్రజలు బయటికి వెళ్లేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలని, డీహైడ్రేట్ కాకుండా ఎండ వేడిమి నుంచి తమను తాము రక్షించుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచించారు. కాగా, ఈ ఏడాది వేసవి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయన్న ఐఎండీ హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. వడగాడ్పుల వల్ల తలెత్తే అనారోగ్య సమస్యలపై మార్చి 1 నుంచి రోజువారీగా నిఘా ఉంచాలని ఆదేశించింది.