కర్ణాటకలోని రాయచూరు జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా దర్శక ధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి నియమితులయ్యారు. రాయచూర్ కలెక్టర్ చంద్రశేఖర్ నాయక్ గురువారం (మార్చి 9) ఈ విషయాన్ని వెల్లడించారు. కర్ణాటకలో మేలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాజమౌళి ఈ బాధ్యతలు తీసుకోవడం కీలకంగా మారింది. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు రాజమౌళి తన వంతు సహకారం అందిస్తారు. వీడియోలు, ప్రత్యేక యాడ్‌ల ద్వారా ఓటర్లకు సందేశం ఇస్తారు. ఎన్నికల సంఘంతో కలిసి పనిచేస్తారు.
బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో అంతర్జాతీయంగా ఖ్యాతి గడించిన ఎస్.ఎస్. రాజమౌళి కర్ణాటకలోని రాయచూరు జిల్లాలోనే జన్మించారు. మాన్వి తాలూకా అమరేశ్వర క్యాంపులో ఆయన జన్మించారు. ఈ నేపథ్యంలో రాయచూరు జిల్లా ఎన్నికల ప్రచారకర్తగా ఆయన పేరును ఎన్నికల కమిషన్‌కు సిఫారసు చేశామని, దీనికి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కలెక్టర్ చంద్రశేఖర్ నాయక్ తెలిపారు. ఈ ప్రతిపాదనను రాజమౌళి కూడా ఆమోదించారని ఆయన వెల్లడించారు.
సాధారణంగా సినీ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులను ఎన్నికల సంఘం ఎన్నికల ప్రచారకర్తలుగా నియమిస్తుంది. ఎన్నికల ప్రచారకర్తలుగా నియమితులైనవారు ప్రత్యక్ష ప్రచారం, వీడియో సందేశాల ద్వారా ఓటరు చైతన్యానికి కృషి చేస్తారు. దర్శకుడు రాజమౌళి ప్రచారంతో ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరుగుతుందని కలెక్టర్ చంద్రశేఖర్ నాయక్ ఆశాభావం వ్యక్తం చేశారు.